స్వేచ్ఛ.. నిజమైన ప్రేమకు పునాది. ఆ విత్తనం నుంచే ఒకరిపై ఒకరికి గౌరవం, నమ్మకం పెరుగుతుంది. అవి లేకుంటే.. అది నిజమైన ‘ప్రేమ’ కాదు. ఎందుకంటే.. ప్రేమ ఎవ్వరినీ, ఎప్పటికీ బంధించదు. పైగా.. అనేక ఆంక్షల నుంచి విడిపిస్తుంది. జీవితానికి నిజమైన అర్థాన్ని అందిస్తుంది. కానీ, కొందరు ప్రేమ పేరుతో భాగస్వామి స్వేచ్ఛను హరిస్తుంటారు. మూడు ముళ్ల బంధంతో.. బందీఖానలో పడేస్తుంటారు. అలాంటి బంధం.. కలకాలం మనలేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రేమ-పెళ్లితో తమను తాము కోల్పోయే వ్యక్తులు ఈ సమాజంలో చాలామందే కనిపిస్తారు. ఎందుకంటే.. భాగస్వామి తనకే సొంతమనీ, ఎప్పుడూ తనతోనే ఉండాలని భావించేవారు అడుగడుగునా తారసపడతారు. ఇలాంటి మనస్తత్వం వారికి.. భాగస్వామిపట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ, అది ఎదుటివారి స్వేచ్ఛను హరిస్తుందని వారు తెలుసుకోలేరు. అయితే, నిజమైన ప్రేమ అంటే.. భాగస్వామి స్వేచ్ఛను హరించడం కాదు… గౌరవించడం. బంధాలు బలంగా ఉండాలంటే.. భాగస్వామికి తనదైన స్వేచ్ఛ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని సలహాలను అందిస్తున్నారు.