ఏజెన్సీ మండలాలను అభివృద్ధి చేయాలి

- అదనంగా నిధులు కేటాయించాలి
- రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావుకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు వినతి
ఆసిఫాబాద్ టౌన్, జైనూర్, లింగాపూర్ జనవరి24: ఏజెన్సీ మండలాలైన గాదిగూడ, నార్నూర్, జైనూర్, సిర్పూర్(యూ)మండలాలకు అదనంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావుకు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు విన్నవించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన లింగాపూర్, గాదిగూడ మండలాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. కుమ్రం భీం పోరాటం, ఆదివాసుల స్థితిగతులను బయటి ప్రపంచానికి చాటి చెప్పిన హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. వారు నివసించిన మార్లవాయిలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందుకు మంత్రి స్పందించి మార్లవాయికి 2017లో వచ్చానని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ లింగాపూర్ మండల అధ్యక్షుడు ఆత్రం అనిల్, సిర్పూర్(యు), గాదిగూడ మండలాల వైస్ ఎంపీపీలు ప్రకాశ్, యోగేశ్, హైమన్ డార్ఫ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఉన్నారు.