గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 06, 2020 , 01:16:15

సమ్మక్క జాతర షురూ..

సమ్మక్క జాతర షురూ..

బెజ్జూర్‌ : మండలంలోని రేచిని అటవీ ప్రాంతం శీపెల్లి గుట్టవద్ద బుధవారం సమ్మక్క- సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది.  మొదటి రోజు  సారలమ్మ కొలువుదీరా రు. కుకుడ, మర్తిడి, బెజ్జూర్‌, నాగుల్వాయి, రేచిని, సోమిని, మొగవెళ్లి, కశ్నపల్లి, ఇందిర్‌గాం తదితర గ్రామాల నుంచి భక్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో భారీగా తరలి వచ్చారు. సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. బెజ్జూర్‌, మర్తిడి, కుశ్నపల్లి సర్పంచులు అన్సార్‌ హుస్సేన్‌, బోర్కుట్‌ లీలా, వడ్డెపల్లి లావణ్య జీపీ ట్యాంకులతో తాగునీటిని సరఫరా చేశారు. నిలువెత్తు బంగారం (బెల్లం)తో తూకం వేసి పంపిణీ చేశారు. జాతర మరో రెండు రోజులు కొనసాగనున్నట్లు కమిటీ సభ్యులు వడ్డెపల్లి శ్రీనివాస్‌. అనంత్‌ రావ్‌, నికాడి బాబురావ్‌ పేర్కొన్నారు. ఎస్‌ఐ సాగర్‌ ఆధ్వర్యంలో బందోబస్తు  నిర్వహించి సమ్మక్క సారలమ్మ వద్ద మొక్కులు తీర్చుకున్నారు. బెజ్జూర్‌ పీహెచ్‌సీ సిబ్బంది హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. కాగా అటవీ అధికారులు డీఆర్వో సవిత, ఎఫ్‌ఎస్‌వో ప్రసాద్‌ రావ్‌, ఎఫ్‌బీవో శ్రీధర్‌ వంటల చేసేటప్పుడు నిప్పుతో అడవిలో అగ్ని ప్రమాదం సంభవించకుండా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. 


పెద్దవాగు తీరంలో..

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని పెద్దవాగు తీరంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. మొదటిరోజు సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజులను కోయపూజారులు భజాభజంత్రీల మధ్య గద్దెల వద్దకు తీసుకువచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకుని ఎత్తుబంగారం సమర్పించి, కోళ్లను ఎదురిచ్చి, వంటవార్పులు చేశారు. కాగజ్‌నగర్‌ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌వో మోహన్‌, రూరల్‌ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌రాజేశ్‌ బందోబస్తు నిర్వహించారు.


logo