కారేపల్లి, ఆగస్టు 30 : ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం) గ్రామానికి చెందిన షేక్ గోర్ పాషా (30)కి తల్లాడ మండలం కల కోడిమ గ్రామానికి చెందిన అనూషతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి 15 నెలల బాబు ఉన్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో అనూష పుట్టింటికి వెళ్లింది. దీంతో మానసికంగా ఆవేదనకు గురైన గోర్ పాషా శనివారం తెల్లవారుజామున వంటింట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి జానీమియా ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ బైరు గోపి కేసు నమోదు చేశారు.