నమస్తే తెలంగాణ, ఆగస్టు 9 : ఆదివాసీలుగా మన హక్కులను కాపాడుకుందామని, మన వారసత్వాన్ని పరరక్షించుకుందామని వక్తలు, ఆదివాసీ నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం వీరోచితంగా పోరాడిన ఆదివాసీ అమరవీరుల విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఊరూరా భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ నేతలు, వక్తలు మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం ఆదివాసీల బాధ్యత అని గుర్తుచేశారు. అలాగే, రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం ఆదివాసీలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆదివాసీలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల హక్కుల కోసం జల్ – జంగల్ – జమీన్ నినాదంతో సాగిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆదివాసీ సమాజ గొప్ప చరిత్రను, సంస్కృతీ సంప్రదాయాలను గుర్తు చేసే ముఖ్యమైన రోజే ఆదివాసీ దినోత్సవమని పేర్కొన్నారు.