ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 14: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్న ఈ పరీక్షలకు నిమిషం నిబంధన అమలులో ఉంది. మరోవైపు అధికారులు కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎలాంటి చిక్కులు లేకుండా ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్లో ఉంచారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఖమ్మం డీఐఈవో కార్యాలయంలో డీఐఈవో రవిబాబు.. ఫ్లయింగ్ స్కాడ్స్, సిట్టింగ్ స్కాడ్స్‌తో సమావేశమై పలు సూచనలు చేశారు.
భద్రాద్రిలో 35 కేంద్రాలు..
భద్రాద్రి జిల్లాలో 35 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరంలో 10,363 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,504 మంది కలిపి మొత్తం 19,868 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మణుగూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సయ్యద్ యూసుఫ్, అశ్వాపురం హిస్టరీ లెక్చరర్ సుధాకర్‌రెడ్డిలతో జిల్లా పరీక్షల కమిటీ ఏర్పాటు చేశారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు కమిషనర్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. దూర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే, ఇబ్బందులు ఎదురుకాకుండా పరీక్ష సమయానికి ముందుగానే చేరుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సులోచనారాణి సూచించారు.
ఖమ్మంలో 63 కేంద్రాలు..
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు అర్ధగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచనలు చేశారు. బుధవారం ప్రారంభం కానున్న ప్రథమ సంవత్సర పరీక్షలకు జనరల్ విభాగంలో 15,444 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 2,446 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
విద్యార్థులకు సూచనలు..
విద్యార్థులు తమ కేటాయించిన పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయాని కంటే ముందుగానే చేరుకోవాలి. హాల్‌టికెట్‌లో పేర్కొన్న పరీక్ష కేంద్రాలు కార్పొరేట్ కళాశాలవి అయితే ఒకటి కంటే ఎక్కువ కేంద్రాలు ఉంటాయి. అలాంటి పక్షంలో ‘కోడ్ నెంబర్ల’ ఆధారంగా సంబంధిత పరీక్ష కేంద్రాలను గుర్తించాలి. ఇంటర్ బోర్డు రూపొందించిన సెంటర్ లోకేటెడ్ యాప్‌ని వినియోగించుకోవాలి. పరీక్ష కేంద్రాల్లో ఏవైనా సమస్యలుంటే 9948663984 నెంబరు ద్వారా ఖమ్మం డీఐఈవోకు ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సందేహాల నివృత్తి కోసం కంట్రోల్ రూంలోని 7793916207, 9948904023 నెంబర్లను సంప్రదించాలి.