కారేపల్లి, సెప్టెంబర్ 20 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి) మండలంలో సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 2 వరకు మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కొనసాగనున్నట్లు సీహెచ్ఓ మాధవి తెలిపారు. శనివారం పేరుపల్లిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అభియాన్ లో భాగంగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, గర్భిణీలకు యాంటినేటల్ చెకప్, రక్తపోటు, షుగర్, కంటి, ENT, దంత పరీక్షలు, రక్తహీనత (అనీమియా), క్షయ వ్యాధి (TB), సికిల్ సెల్, అనీమియా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా నోటి, స్తన, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, రోగ నిరోధక టీకాలు, టెలీ మెడిసిన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. పోషకాహారం ప్రోత్సాహం, రుతుక్రమ పరిశుభ్రత, స్థానిక ఆహార పదార్థాల వినియోగం, ఊబకాయం తగ్గింపు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇంటి చుట్టూ నిల్వ నీరు లేకుండా చూడాలన్నారు, ట్యాంకులు, డబ్బాలు మూతలతో ఉంచాలన్నారు. రాత్రి పూట దోమ తెరలు ఉపయోగించడం, శుభ్రత పాటించడం, సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులను సమర్థంగా నివారించవచ్చన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నివారణ సాధ్యమని ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత ఉంటేనే గ్రామం ఆరోగ్యవంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఈసం కృష్ణవేణి, పొదెం నాగమణి, ఎం ఎల్ హేచ్ పీ, ఆశా కార్యకర్తలు రాంబాయి, రేణుక పాల్గొన్నారు.