కారేపల్లి, ఆగస్టు 30 : ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, సైకాలజిస్ట్, డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. జీవితం జీవించడానికే అని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని, వైఫల్యాలను అధిగమిచి అఘాయిత్యాల ఆలోచనను మానుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన మనిషి పరిపూర్ణుడు అవుతాడని తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో శనివారం ఆత్మహత్యల నివారణ సదస్సు నిర్వహించారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ బైరు గోపితో కలిసి డాక్టర్ అశోక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునే వ్యక్తులకు సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలన్నారు. తనకి ఎవరూ లేరనే అగాధాన్ని పూడ్చే ప్రయత్నంతో భరోసా నింపాలన్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకున్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడే ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుంటుందన్నారు. ఆ ప్రమాదకర క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయట పడతారన్నారు. రైతులు తాను పండించిన పంట చేతికి అందే సమయంలో గిట్టుబాటు ధర లేక, ప్రపంచానికి అన్నం పెట్టే తనకే అప్పుల బాధతో అవమానం జరగడంతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్ఐ బైరు గోపి మాట్లాడుతూ.. ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత 20 ఏండ్లుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తూ ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య నివారణ మార్గాలు, జీవిత సంఘర్షణ, ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలు,యోగా తదితర అంశాలపై సోదాహరణగా వివరించారు. అనంతరం ఆత్మహత్యలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించి ఆత్మహత్యలు చేసుకోబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, సామాజికవేత్తలు కందగట్ల వెంకన్న, గోపిశెట్టి సత్యనారాయణ, భూక్య అబ్దుల్ కలాం పాల్గొన్నారు.