కొణిజర్ల, జూన్ 7 : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించినైట్లెతే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) విజయనిర్మల హెచ్చరించారు. శుక్రవారం తనికెళ్లలోని విత్తన దుకాణాలను వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఎంఏవో బాలాజీతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టాక్ రిజిస్టర్, బిల్బుక్స్, ఇన్వాయిస్, జీవోటీ కాపీలు కలిగి ఉండాలని, రైతులకు విక్రయించే విత్తన ప్యాకెట్ వివరాలు నమోదు చేస్తూ రిజిస్టర్ నిర్వహించాలన్నారు.
రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి రశీదులు విధిగా ఇవ్వాలని, పంట చివరి కాలం వరకు వాటిని భద్రపరుచుకోవాలని సూచించారు. గరిష్ఠ ధరలకు లోబడి మాత్రమే విత్తనాలను విక్రయించాలని, లూజ్ ప్యాకెట్లు, గుడ్డ సంచుల్లో విక్రయించే విత్తనాలకు అనుమతి లేదన్నారు. డీలర్లు విధిగా దుకాణాల ఎదుట స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని, అందులో స్టాక్ వివరాలను తెలుగులో పొందుపర్చాలని సూచించారు. రైతులు ఒకే కంపెనీకి చెందిన విత్తనాలు కొనుగోలు చేసి డిమాండ్ పెంచొద్దని, కంపెనీ విత్తనాలు ఏవైనా మంచి దిగుబడి వస్తుందన్నారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.