కారేపల్లి, (సత్తుపల్లి) డిసెంబర్ 7: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నమస్తే తెలంగాణ ఆర్సీ ఇంచార్జ్ దమ్మాలపాటి సత్యనారాయణ(56) మృతి చెందారు. గత కొంతకాలంగా డయాలసిస్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుమారు పది రోజుల క్రితం సత్యనారాయణనను నిమ్స్‌లో చేర్పించారు కుటుంబసభ్యులు. అయితే.. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చిందని, ఆదివారం రాత్రి సత్యనారాయణ మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
గత పాతికేళ్లుగా సత్యనారాయణ పాత్రికేయుడిగా వివిధ పత్రికల్లో పని చేశారు. నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభించినప్పటి(2009) నుండి సత్తుపల్లి రిపోర్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన.. ప్రస్తుతం ఆర్సీ ఇన్చార్జి హోదాలో ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే సత్యనారాయణ మరణం పట్ల స్థానికులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ పార్టీల, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులతో పాటు పలువురు సంతాపం ప్రకటించారు. ఇంటిపెద్దను కోల్పోయిన ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. సత్యనారాయణ స్వగ్రామమైన సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.