కారేపల్లి, ఆగస్టు 25 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ లేకపోవడంతో పనులు కాక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సింగరేణి తాసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఆర్ఐలు విధులు నిర్వహిస్తుండగా, ఆరు నెలల కిందట ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ బదిలీపై వెళ్లాడు. దాంతో ఉన్న ఒక్క ఆర్ఐ విధుల్లో ఉంటూ ఎటువంటి పనులు పెండింగ్‌లో లేకుండా చూసుకుంటున్నాడు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉన్న ఒక్క ఆర్ఐ ఖమ్మం కలెక్టరేట్‌కి డిప్టేషన్పై వెళ్లగా మండల నలుమూలల నుండి వివిధ పనులపై వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాసీల్దార్ కార్యాలయం నుండి ఎటువంటి సర్టిఫికెట్ జారీ చేయాలన్న ఆర్ఐ క్షేత్రస్థాయి పరిశీలన, ధ్రువీకరణ తప్పనిసరి.
కొద్ది రోజులుగా ఆర్ఐ అందుబాటులో లేకపోవడం వల్ల పనులు కాక దరఖాస్తుదారులంతా కార్యాలయం చుట్టూ తిరుగుతూ నీరసించిపోతున్నారు. తాసీల్దార్, డిప్యూటీ తాసీల్దార్ ఇక్కడ విధుల్లో చేరి కొద్ది రోజులు మాత్రమే కావడంతో మండలంపై పూర్తి అవగాహన లేకపోయింది. మరొకవైపు అత్యవసరంగా సర్టిఫికెట్లు అవసరం ఉన్నవారు సకాలంలో చేతికందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సింగరేణి (కారేపల్లి) మండల తాసీల్దార్ కార్యాలయానికి శాశ్వత (పూర్తి బాధ్యతలు కల్పించబడిన) రెవెన్యూ ఇన్స్పెక్టర్ను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.