మధిర, మే 06 : మధిర పట్టణంలో అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరాపై విద్యుత్ శాఖ మధిర సబ్ డివిజన్ ఆఫీసు నందు ఖమ్మం సర్కిల్ ఎస్ఈ శ్రీనివాసచారి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పట్టణంలో భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా చేయుటకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్కూర్ రింగ్ రోడ్డు నుండి మధిర పట్టణంలోని నందిగామ బైపాస్ రోడ్డు వరకు, ఆర్వీ కాంప్లెక్స్ నుండి బస్టాండ్ వరకు భూగర్భ కేబుల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రజలకు విద్యుత్ అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని సిబ్బందికి సూచించారు. రెండు రోజుల్లో సమగ్ర సర్వే నిర్వహించి టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీకి తగు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎస్ఈ తెలిపారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ వైరా డివిజన్ డీఈ శ్రీనివాసరావు, కన్స్ట్రక్షన్ డీఈ హీరాలాల్, ఆర్ అండ్ బీ డీఈ శంకరరావు, మున్సిపల్ డీఈ నరేశ్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏడీఈలు అనురాధ, నాగమల్లేశ్వరరావు మధిర పట్టణ ఏఈ అనిల్ కుమార్ తోపాటు డీపీఆర్ తయారు చేసే ఏజెన్సీ ప్రతినిధి భరత్ భూషణ్ పాల్గొన్నారు.