కారేపల్లి, జూన్ 06 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఎర్రబోడు సమీపంలో గల ఊటవాగు వలస ఆదివాసీగూడెంలో ఉన్న సోలార్ వీధి దీపాలకు శుక్రవారం మరమ్మతులు నిర్వహించారు. గత రెండేండ్ల క్రితం అప్పటి కారేపల్లి ఎస్ఐ పుష్పాల రామారావు చొరవతో ఇల్లందు సింగరేణి కాలరీస్ సంస్థ జనరల్ మేనేజర్ షాలేం రాజు సహకారంతో దట్టమైన అడవిలో విద్యుత్ సదుపాయం లేని ఆ గూడేనికి రూ.80 వేల వ్యయంతో సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
అవి గత రెండు నెలలుగా వెలగకపోవడంతో గ్రామం అంధకారంలో ఉంది. దీంతో విషయాన్ని గ్రామస్తులు ప్రస్తుత వైరా ఎస్.ఐ రామారావు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎస్ఐ కొత్తగూడెం సింగరేణి జిఏం షాలేం రాజుతో మాట్లాడి వీధి దీపాలకు కొత్త బాటరీల ఏర్పాటు, ఎల్ఈడీ బల్బులు అమర్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివాసిలు ఎస్ఐ రామారావుకు కృతజ్ఞతలు తెలిపారు.