భద్రాచలం, జూన్ 12 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీలను బుధవారం లెక్కించగా.. 41 రోజులకు రూ.1,68,54,129లు సమకూరినట్లు ఈవో ఎల్.రమాదేవి తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా రూ.1.68 కోట్లు, బంగారం 117 గ్రాములు, వెండి 1.300 గ్రాములు వచ్చిందని పేర్కొన్నారు. అలాగే 557 అమెరికన్ డాలర్లు, 5 ఖతర్ రియాల్స్, 20 ఇంగ్లాండ్ ఫౌండ్స్, 20 ఫిలిఫైన్స్ పీసో, 950 నేపాల్ రూపాయలు, 20 యూఏఈ దిరాన్స్, 14 మలేషియా రింగిట్స్, 60 ఆస్ట్రేలియా డాలర్లు, 20 కెనడా డాలర్లను భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించారని తెలిపారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకొని కానుకలు సమర్పించారని, గతంతో పోలిస్తే స్వామివారి ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. గతంలో మే 2న హుండీలను తెరిచి లెక్కించామన్నారు.