ఖమ్మం వ్యవసాయం, జనవరి 18 : ఖమ్మంలో మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగిన మొట్టమొదటి సభ విజయవంతమైంది. ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెం వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు దేశం, రాష్ట్రం నలుమూలల నుంచి జనం భారీగా తరలొచ్చారు. ఈ సందర్భంగా వారిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా.. వారి అభిప్రాయాలు వెలుబుచ్చారు. ఆ వివరాలు..
కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలన్నదే నా కోరిక
సీఎం కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలన్నదే నా కోరిక. 2014 తర్వాత సీఎం కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేసీఆర్ సభ ఎక్కడ జరిగినా వెళ్తున్నా. నా సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్తున్నా. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫ్లెక్సీ తయారు చేయించుకొని ప్రదర్శిస్తుంటాను. సీఎం కేసీఆర్ సేవలు దేశవ్యాప్తంగా అందితే ప్రజలకు మేలు జరుగుతుంది.
– గజిబిన్కార్ మనోహర్, గాంధీనగర్, సిద్దిపేట
పథకాలు బాగున్నాయి..
కేసీఆర్ చెప్పే మాటలు విని మా వాళ్లకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. గతంలో మా ఊరు నుంచి చాలామంది కూలి, ఇతర పనులకు ఇక్కడికి వచ్చారు. కేసీఆర్ సార్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఆడపిల్లల పెండ్లికి సాయం చేయడం అభినందనీయం. రోడ్లు, నీళ్లు అన్నీ ఇచ్చి మంచి పనులు చేస్తున్నారు. కేసీఆర్ సార్ ప్రధాని అయితే బాగుంటుంది.
-పత్తేలాల్ బిలాసపుర్ మండలం, సారంగడ్, జిల్లా ఛత్తీస్‌గఢ్
మాక్కూడా కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి
సీం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మాకు కూడా కావాలి. ఒక్క నాయకుడు కోసం ఇక్కడికి ఇంత జనం వస్తున్నారంటే ఆయన అంటే ఎంతో ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రోడ్లకు, మా దగ్గర రోడ్లకు చాలా తేడా ఉంది. మా దగ్గర తాగుడానికి కనీసం మంచినీళ్లు కూడా దొరకవు. ప్రతి ఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఏండ్ల తరబడి మా దగ్గరి వాళ్లు ఇక్కడికి పనులకు వస్తారు. ఇక్కడి వాళ్లు మా దగ్గరికి రారు.
-పరమేశ్వర్, బిలాసపుర్ మండలం, సారంఘడ్ జిల్లా,
ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ను బలోపేతం చేస్తాం..
కేసీఆర్ లాంటి నాయకుడు ప్రధాని కావాలి. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుంది. ఇలాంటి పథకాలు మాకూ కావాలనే బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలొచ్చాం. విజన్ ఉన్న నాయకుడిని చూసే అవకాశం కలిగింది. నాందేడ్ నుంచి 50 మంది వరకు ఈ సభకు మా సొంత ఖర్చులతో వచ్చాం.
– శంకర్‌సింగ్, నాందేడ్ వాసి, మహారాష్ట్ర
ఇంత జనం వస్తరనుకోలేదు..
దేశ్‌కీ నేత కేసీఆర్‌ను చూడాలని వచ్చా. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు ఖమ్మం రావాలని అనుకున్నాం. చూరుం జిల్లా నుంచి ఐదుగురం వచ్చాం. ఇక్కడికి తరలొచ్చిన ప్రజల ఫొటోలు తీసి మావాళ్లకు ఎప్పటికప్పుడు పంపిస్తున్నా. కేసీఆర్‌తో నడవాలని మాకు కోరిక ఉంది. మా రాష్ట్రంలో కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు. వార్తల్లో ఆయన చేసిన పనులు చెబుతున్నారు. మీటింగ్‌కు ఇంత జనం వస్తరనుకోలేదు. దేశ నాయకులు, ముఖ్యమంత్రుల సమావేశం జరిగినా.. ఇంత జనం రారు. కేసీఆర్ అంటే ఇక్కడి ప్రజలకు అంత అభిమానం.
-యాసన్ బయ్యా, చూరూం జిల్లా, రాజస్థాన్
కుటుంబసభ్యులతో కలిసి వచ్చా..
చిన్నతనం నుంచి కేసీఆర్ అంటే అభిమానం. గతంలో అనేకసార్లు కేసీఆర్‌ను చూడాలని అనుకున్నా.. కుదరలేదు. ఖమ్మం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సభకు వచ్చాను. ఉదయమే సభా ప్రాంగణం చేరుకున్నా. సీఎం కేసీఆర్‌ను దగ్గరగా చూడాలనుకున్నాం. అందుకే, మా అంతట మేమే వచ్చాం. ఈ రోజు మా కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌ను చూసినందుకు సంతోషంగా ఉంది.
– రేవంత్, యువకుడు, ఖమ్మం
నా పెద్దకొడును కండ్లారా చూశా..
సీఎం కేసీఆర్ నాకు పెద్దకొడుకు.. ఆయన మీటింగ్ అంటే జనం బాగా వస్తారు. ఎంత కష్టమైనా కేసీఆర్‌ను చూడాలని, కొడుకు మాటలు వినాలని వచ్చా. నాకు ఫించన్ ఇవ్వడమే కాకుండా, మా కుటుంబానికి సాయం చేసిన దేవుడు. నున్న మీటింగ్‌కు తీసుకెళ్లాలని మా ఇంటిపక్కల వాళ్లను అడిగాను. వాళ్లు కూడా సరే అన్నారు. అందుకే పొద్దుగాలనే వచ్చా. నాకు ఎంతో సంతోషంగా ఉంది.
– సత్తెమ్మ, వెలుగుమట్ల, ఖమ్మం జిల్లా
రెండు రోజుల క్రితమే ఖమ్మం వచ్చా
మా దోస్తులు సీఎం కేసీఆర్ గురించి ఎప్పుడూ చెబుతుంటారు. ఆయన చాలా మంచివాడు. ఇక్కడ వారికి ఎంతో సాయం చేస్తున్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన దేశవ్యాప్తంగా పార్టీ పెడితే అందరికీ ప్రయోజనం. రెండు రోజుల క్రితమే ఖమ్మం వచ్చాను. మాకు తెలిసిన వాళ్ల దగ్గర ఉన్నాం. జెండాను కూడా నేనే కొనుక్కున్నాను. ఒంటిపై కప్పుకొని వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉంది.
-చోమాలీస్, చూరూం జిల్లా, రాజస్థాన్