కారేపల్లి, ఆగస్టు 26 : ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కారేపల్లి మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీకి సంబంధించిన రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు, వరద నీటి ముంపులో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేసి దోమల నివారణ మందులను చల్లాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.