భద్రాచలం, అక్టోబర్ 15: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం దసరా ఉత్సవా సందర్భంగా శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అర్చకులు లక్ష్మీతాయారమ్మ అమ్మవారిని ‘ఆదిలక్ష్మి’గా అలంకరించారు. ఇదే అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. అర్చకులు తొలుత అమ్మవారికి పంచామృతాలు, నారికేళ జలం, తొమ్మిది రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
విష్ణు సహస్ర నామ పారాయణం, రామాయణ బాలకాండ పారాయణం చేశారు. చిత్రకూట మండపంలో ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు సామూహిక రామాయణ పారాయణం చేశారు. లక్ష్మీతాయారమ్మ సన్నిధిలో మహిళలతో సామూహిక కుంకుమార్చన, సాయంత్రం దర్బార్ సేవ, నివేదన, మహా మంత్ర పుష్పం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో ఎల్.రమాదేవి, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు పర్యవేక్షించారు. సోమవారం అమ్మవారు సంతానలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపారు.