ఖమ్మం, రూరల్, మార్చి 19 : మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణతో పాటు, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పోలేపల్లి వద్ద మున్నేరుపై జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, రిటైనింగ్ వాల్ కొరకు భూసేకరణ పురోగతి, మున్నేరు భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చే స్థలం, మున్నేరు యాక్వీడేట్ను కలెక్టర్ పరిశీలించారు. రోజువారిగా ఎంత మేరకు పని జరగాలో ప్రణాళిక వేసి కార్యాచరణ చేయాలని, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేసుకొవాలన్నారు. వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పరిస్దితులకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల మ్యాప్ లను పరిశీలించి, వరదలు వస్తే ఎంత మేరకు నీరు చేరుతుంది, అధికంగా ఫోర్స్ తో నీటి ప్రవాహం వచ్చినప్పుడు తట్టుకునేందుకు రిటైనింగ్ వాల్ లో నాణ్యత, నిర్మాణంలో మెటీరియల్, వాల్ క్యూరింగ్ విషయాలలో పాటించాల్సిన జాగ్రత్తలను కలెక్టర్ అధికారులకు, గుత్తేదారులకు వివరించారు. భవిష్యత్లో ఎక్కువ మొత్తంలో వరద వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవాహ సామర్థ్యం అంచనాతో శాస్త్రీయంగా నిర్మాణ పనులు చేపట్టినట్లు సూచించారు. మున్నేరు వాల్ కు ఆనుకుని రోడ్డు, డ్రైనైజీ కాల్వ నిర్మిస్తున్నట్లు చెప్పారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిని ఇచ్చి, భూసేకరణ చేసేలా అధికారులు రైతులతో చర్చిస్తున్నట్లు వివరించారు.
భూనిర్వాసితులకు అభివృద్ధి చేసిన భూములు ప్రత్యామ్నాయంగా అందించి త్వరగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పనుల పురోగతిపై రోజువారి నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సేకరించాల్సిన ప్రైవేట్ భూముల యజమానులతో చర్చించి సదరు భూములను వెంటనే స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఈ రమేశ్, ఖమ్మం రూరల్ తాసీల్దార్ రాంప్రసాద్, ఆర్ఐ క్రాంతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.