ఖమ్మం రూరల్/ రఘునాథపాలెం, డిసెంబర్ 29: గ్రానైట్ పరిశ్రమ.. వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తూ ఉపాధి కల్పిస్తోందని గాయత్రీ గ్రానైట్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం బైపాస్‌రోడ్డులోని పీవీఆర్ గార్డెన్లో ఆదివారం జరిగిన గ్రానైట్ ట్రేడర్స్, మార్కర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణలో అనేక జిల్లాల్లో విస్తరించిన ఉన్న ఈ గ్రానైట్ పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోందని అన్నారు.
అలాగే, గ్రానైట్ పరిశ్రమను నమ్ముకొని నిర్వాహకులు, హమాలీలు, మార్కర్స్ సహా ఇతర అనేక పనులకు సంబంధించిన వ్యకులు ఉపాధి పొందుతున్నారని వివరించారు. అందుకని ఐక్యంగా ఉండి పరిశ్రమను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నష్టాల ఊబిలో ఉన్న పరి్రశ్రమను కాపాడుకునేందుకు ప్రభుత్వం కచ్చితంగా చేయూతనివ్వాలని అన్నారు. స్లాబ్ ప్రకారంగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కొంతమంది పోలీసులు, మైనింగ్ అధికారులు గ్రానైట్ రంగంలోని వారిని దొంగలను చూసినట్లు చూడడం సరికాదని అన్నారు.
లీజుకు తీసుకున్న ప్రాంతంలోనే క్వారీలు నడుపుతున్నప్పటికీ ఇటీవల కొందరు అధికారులు క్వారీ యజమానులను ఇబ్బంది పెట్టేలా ఈటీసీ నోటీసులు ఇస్తున్నారని అన్నారు. ఆ నోటీసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలుత గ్రానైట్ మార్కర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను, డైరీని ఆవిష్కరించారు. అసోసియేషన్ బాధ్యులు తమ్మినేని సాగర్, రియాజ్, నరేందర్, వెంపటి ఉపేందర్, జానీ, నవీన్‌కుమార్, రహీం, శేషగిరి, శంకరాచారి, నూనావత్ కిషన్, బూర్ల కృష్ణ, శేఖర్, నర్సింహారావు, శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్, రామ్మూర్తి, హనుమంతరావు, సైదులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.