ఖమ్మం రూరల్: పిల్లి గుడ్డిదైతే ఎలక వచ్చి కంచం ఎత్తుకపోయినట్లుంది ఈ ఫొటోలో ఉన్న క్రీడా మైదానం పరిస్థితి చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులలో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకుగాను ఎంతో దూర దృష్టితో ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ ఊరూరా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. అయితే తాతల ధర్మాన కోటలు కడితే మనుమల పుణ్యాన ఉన్నది ఊడగొట్టినట్టుగా తయారైంది సంబంధిత అధికారుల తీరు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని తీర్థాల గ్రామ యువకులకు విద్యార్థులకు ఈ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిన కొత్తలో ఎంతో భరోసా కల్పించింది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఏర్పాటు ఉద్దేశం నిర్వీర్యం అవుతుంది. ఇప్పటికే ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో సంబంధిత అధికారులే స్వయంగా బుల్డోజర్లతో నేలమట్టం చేసిన సంగతి తెలిసింది. అయితే తీర్థాల గ్రామంలో ఏకంగా క్రీడా ప్రాంగణాన్ని మాగానిగా మార్చి గత కొద్ది సంవత్సరాలుగా పంటలు సాగు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈ క్రీడా ప్రాంగణాన్ని ఎవరైనా కబ్జాకు యత్నించారా మరి ఏమిటో తెలియదు కానీ స్వయంగా బోర్డు ఉన్నప్పటికీ పంటపొలంగా మార్చుకోవటం అటువైపుగా వెళుతున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం పట్ల గ్రామ యువకులు, విద్యార్థులు సర్కార్ తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్రీడా ప్రాంగణాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.