నీ లెటర్ మొత్తం చదివి ఎంతో చలించిపోయాను. ఎంతో బాధ అనిపించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిన్నటికి కరెక్టుగా రెండేళ్లయింది. అందుకే నిన్న ప్రెస్‌మీట్ పెట్టి ఘాటుగా మాట్లాడాను. ‘మా వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు. ప్రభుత్వం మీద చార్జ్‌షీట్’ అని చెప్పి గట్టిగా చెప్పాను. నా రిక్వెస్టల్లా ఒక్కటే.. బతికుండి పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించేదేమీ లేదు.
ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 4: బతికుండి పోరాడుదామని, చనిపోయి సాధించేదేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఖమ్మం నిరుద్యోగ యువకుడు వేణుకుమార్‌కు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, జాబ్ క్యాలెండర్ అమలుచేయడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగ యువకుడు వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. అక్కడి నుంచే కేటీఆర్‌కు ఫోన్ చేశారు. దీంతో అతడి ఫోన్ నుంచి వేణుతో కేటీఆర్ మాట్లాడారు. మీకు, యూత్‌కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కలిసి పోరాడుదామని ధైర్యం చెప్పారు. అందుకు వేణు స్పందిస్తూ.. తన సూసైడ్ తన ఒక్కడి కోసమే కాదని, టోటల్ తెలంగాణ కోసమమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు బతకనీయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్, వేణు మధ్య జరిగిన సంభాషణ ఇదీ..
రాకేశ్‌రెడ్డి ఫోన్లో కేటీఆర్: వేణు ఉన్నాడా?
వేణు: నమస్తే సార్ బాగున్నారా..
కేటీఆర్: వేణు నమస్తే అమ్మా.. నేను బాగున్నాను. మీరు బాగున్నారా..?
వేణు: బాగున్నా సార్. కొంచెం పర్లేదు సార్. హాస్పిటల్లోనే ఉన్నా సార్. ఇప్పుడు కొంచెం కోలుకున్నా.
కేటీఆర్: కరెక్టేగానీ, అంత తొందరపాటు నిర్ణయం ఎందుకు చెప్పు?
వేణు: తొందరపాటు నిర్ణయం కాదు సార్ ఇది. మూడేళ్ల నుంచి జాబ్ క్యాలెండర్ కోసం ఎంతో పోరాడుతున్నా. ఈ రోజు వరకు కూడా ఓ జాబ్ క్యాలెండర్ లేదు. ఏదీ లేదు. మాలాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్. ఇది నా ఒక్కడి కోసం కాదు సార్. టోటల్ తెలంగాణ కోసం చేశాను. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. నియామకాల విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంటే.. ఎవరూ ప్రశ్నించేవాళ్లు లేరు సార్. కాంగ్రెస్ అంతా ఒక ముఠా అయింది. ఆ పార్టీలో ఎవరితో మాట్లాడినా పిచ్చి బూతులు. చిన్న నాయకులదీ అదే తీరు. మా అమ్మ మానసిక వికలాంగురాలు. మాకు ఇల్లు లేదు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కనీసం మాకు ఇల్లు ఇవ్వలేదు సార్.
కేటీఆర్: అవునమ్మా.. మా వాళ్లు చెప్పారు నాకు.
వేణు: వికలాంగుల కోటాలో ఇల్లు ఇవ్వకుంటే ఎట్ల సార్. 17 ఏళ్ల నుంచి మేం ఇబ్బంది పడుతున్నాం. అంత అన్యాయమా సార్. నేను ఆరోజే నిర్ణయించుకున్నా. జాబ్ కొట్టందే మా లైఫ్ మారదని ఆ రోజే నిర్ణయించుకున్నా. నాతో ఎవరు ఉన్నా లేకపోయినా జాబ్ క్యాలెండర్ కోసమే నేను చచ్చిపోయే నిర్ణయం తీసుకున్నా. ఒకవేళ నేను బతికుంటే దానికోసమే పోరాడుదామనేసి డిసైడ్ అయ్యా.
కేటీఆర్: వేణు ఒక్కమాటమ్మా.. నీ లెటర్ మొత్తం చదివాను నేను. చదివాకే ఎంతో చలించిపోయాను. ఎంతో బాధ అనిపించింది. కరెక్టుగా రెండేళ్లు నిండింది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.
వేణు: అవును సార్. అవును.
కేటీఆర్: అందుకే నిన్న ప్రెస్‌మీట్ పెట్టి ఘాటుగా మాట్లాడాను. ‘మా వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు. ప్రభుత్వం మీద చార్జ్‌షీట్’ అని చెప్పి గట్టిగా మాట్లాడాను. నా రిక్వెస్టల్లా ఒక్కటే. బతికుండి పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించేదేమీ లేదు.
వేణు: నేను అదే అనుకున్నా సార్. కానీ, కాంగ్రెస్ వాళ్లు బతకనియ్యట్లేదు కదా సార్.
కేటీఆర్: ఏం కాదు. మేమందరమూ ఉన్నాం కదా నీకు. అండగా ఉంటాం. ధైర్యంగా ఉండు.
వేణు: ఈ రోజంటే మీరు మాట్లాడారు. ఇన్ని రోజులు నాకు ధైర్యం లేదు. ఎటువంటి అవకాశం లేదు. ఎవరితో మాట్లాడుదామన్నా భయం. ఈ కాంగ్రెస్‌లో కింది వాళ్లు రెచ్చిపోతున్నారు. వాళ్లే కలెక్టర్లన్నట్లు ఫీలైపోతున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ అనేది సరిగా లేదు సార్ ఈ వ్యవస్థలో. ఈ వ్యవస్థే సరిగా లేదు సార్.
కేటీఆర్: అవునమ్మా.. ఒకసారి నువ్వు డిశ్చార్జి అయిన తరువాత నేను ఖమ్మం వస్తాను. ఒకసారి కలుసుకుందాం. తప్పకుండా నువ్వు అన్నట్లుగా జాబ్ క్యాలెండర్ కోసం, కాంగ్రెస్ వాళ్లిచ్చిన హామీలను అమలు చేయించేందుకోసం పోరాడుదాం. ఈ విషయంలో మీకంటే ఒక అడుగు ముందుంటాం. మీ అందరికీ అండగా నిలబడతాం. ఆ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. రెండోది.. నీకు మాట ఇస్తున్నా. నీ సూసైడ్ నోట్ ఏదైతే ఉందో.. దాని ద్వారా తెలంగాణ యూత్ అందరికీ లాభం జరిగేదాకా నీ తరఫున బీఆర్ఎస్ కొట్లాడతది. నీతోపాటు ఉంటుంది. మనం కచ్చితంగా మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాం. వచ్చాక నీతోపాటు నీ నోటు ఆధారం చేసుకొని రేపటి రోజున యూత్‌కు న్యాయం చేసే బాధ్యత నాది.
వేణు: సరే సార్.
కేటీఆర్: రాకేశ్ అన్న మీతో టచ్‌లో ఉంటారు.
వేణు: అయితే నేను కూడా మరీ ఇంత డెసిషన్ తీసుకోవాలని అనుకోలేదు సార్. నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటంటే.. మా అమ్మకు బైపోలార్. ఆమెకు నెలకు రూ.8 వేలు అవుతున్నాయి. మాకు వచ్చే ఇన్‌కం కూడా ఏమీలేదు.
కేటీఆర్: తప్పకుండా సాయం చేస్తాను. రాకేశ్ అన్నకు చెప్తాను. నేనే మీకు కలిసి సాయం చేస్తాను.
వేణు: మీరైతే ఒకసారి కంపల్సరీ కలవాలి సార్ నన్ను.
కేటీఆర్: వస్తాను. ఖమ్మం రాగానే కలుస్తాను.
వేణు: థ్యాంక్యూ సార్. థ్యాంక్యూ సో మచ్ సార్.
కేటీఆర్: థ్యాంక్యూ అమ్మా..