ఖమ్మం కల్చరల్/ ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్/ రఘునాథపాలెం, సెప్టెంబర్ 26: ‘అటుకుల బతుకమ్మా.. చల్లంగ చూడమ్మా..’ అంటూ ఆడబిడ్డలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం మహిళలు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ రోజునే దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు కూడా ప్రారంభం కావడంతో ఈ రెండు ఉత్సవాలతో జిల్లా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఆవరణ, నగరంలోని పలు డివిజన్లలోని కూడళ్లు, గుంటు మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రెండవ రోజు అటుకుల బతుకమ్మ సంబురాలను ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
రాజస్థాన్ నవయువక్ మండలి ఆధ్వర్యంలో ప్రభాత్ టాకీస్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రుల మహోత్సవంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మేయర్ నీరజ, విద్యాసంస్థల డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య బతుకమ్మ ఆడారు. విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక పాల్గొన్నారు. సర్వజ్ఞ పాఠశాలలో డైరెక్టర్ కొలిపార నీలిమ బతుకమ్మ ఆడారు. డైరెక్టర్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.