మనకు ఎవరైనా రాఖీ కడితే ఏం చేస్తాం.. సోదరీమణులకు చీర లేదా తోచినంత నగదు లేదా మరింకేదో బహుమతి ఇస్తాం.. కానీ ఓ సోదరుడు వినూత్నంగా ఆలోచించాడు. చిన్నప్పటి నుంచి తాను దాచుకున్న పాకెట్ మనీని ఏకంగా తులాభారం వేసి అక్కకు కానుకగా ఇచ్చాడు.
అతడే ఖమ్మం నగరానికి చెందిన త్రివేది. చదివేది10వ తరగతే. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన అక్కకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అందుకు ‘రాఖీ’ పర్వదినాన్ని ఎంచుకున్నాడు. రూ.5 నాణేలతో అక్కకు ‘తులాభారం’ వేశాడు. అంతేకాదు బంధు మిత్రులకు భోజనం పెట్టి అక్కాతమ్ముళ్లు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ అపురూప ఘట్టం శుక్రవారం ఖమ్మం నగరంలో ఆవిష్కృతమైంది.
– రఘునాథపాలెం, ఆగస్టు 12
మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన బొలగాని బసవనారాయణ 15 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి ఖమ్మం నగరంలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు కుమార్తె రణశ్రీ, కుమారుడు త్రివేది. కుమార్తె రణశ్రీకి గతేడాది వివాహమైంది. కుమారుడు నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో పదోతరగతి చదువుతున్నాడు.
త్రివేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని రూ.5 నాణేలుగా మార్చి దాచుకునే అలవాటు ఉండేది. తల్లిదండ్రులు ఎందుకు దాస్తున్నావని అడిగినా ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. వివాహానికి ముందు సోదరి అడిగినా చెప్పలేదు. పెళి తర్వాత ఆమె అత్తారింటికి వెళ్లింది. క్రమంగా త్రివేది దాచిన నాణేలతో ఒక బస్తా నిండింది. తాజాగా తల్లిదండ్రులకు నాణేల గుట్టు విప్పాడు త్రివేది. పెళ్లి తర్వాత తొలిసారి ‘రక్షాబంధన్’కు ఇంటికి వస్తున్న సోదరికి నాణేలను ‘తులాభారం’ ఇస్తానన్నాడు.
కుమారుడి కోరికకు పొంగిపోయిన తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా వేడుక నిర్వహించాలనుకున్నారు. వేడుకకు బంధుమిత్రులకు ఆహ్వానం పంపారు. త్రివేది శుక్రవారం వారి స్వగృహంలో అక్కకు తులాభారం వేసి ఆమె బరువుకు సరపడినన్ని రూ.5 నాణేలను కానుకగా ఇచ్చాడు. ఆమె బరువు 61 కిలోలు కాగా తులాభారంలో 11,200 వేల నాణేలు తూగాయి. అంటే వాటి విలువ అక్షరాలా రూ.56 వేలు. సోదరుడి సర్ప్రైజ్కు సోదరి, బావ ఉప్పొంగిపోయారు. వేడుకకు వచ్చిన బంధువులు వారిని ఆశీర్వదించారు.
అక్క అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నేను ఏ విషయాన్నైనా ఆమెతోనే చర్చించేవాడిని. ఆమెపై ప్రేమతోనే ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ‘తులాభార’ వేడుకలో తల్లిదండ్రులు, అక్క, బావ ఎంతో ఆనందించారు. అమ్మానాన్న పెద్ద ఫంక్షన్‌లా వేడుక నిర్వహించారు. నాకు ఇది ఒక అపురూప జ్ఞాపకం.
– త్రివేది