ఖమ్మం, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బానోతు మదన్‌లాల్ గుండెపోటుతో సోమవారం అర్ధరాత్రి మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. కొద్దిరోజులక్రితం వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను తొలుత ఖమ్మంలోని దవాఖానలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఐజీకి తరలించారు. చికిత్స పొందుతుండగానే సోమవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురై మృతిచెందారు.
ఖమ్మం/ రఘునాథపాలెం, మే 27: మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మరణవార్త తెలుసుకున్న పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఖమ్మం నగరానికి తరలివచ్చి నివాళులు అర్పించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని మదన్‌లాల్ ఇంటికెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మదన్‌లాల్ కుమారుడు ఐఏఎస్ మృగేందర్‌లాల్‌ను ఓదార్చారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి మదన్‌లాల్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. నివాళులు అర్పించిన వారిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, బానోత్ హరిప్రియ, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్,
బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, అజ్మీరా వీరూనాయక్, బొమ్మెర రామ్మూర్తి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, బాణాల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీలు కట్టా కృష్ణార్జునరావు, సామినేని హరిప్రసాద్, వైరా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, మోరంపూడి ప్రసాదరావు, గొడ్డేటి మాధవరావు, బత్తుల శ్రీను, వాకదాని కోటేశ్వరరావు, ఏదునూరి శ్రీను, పాల్వంచ రాజేష్, సరిపూడి గోపి సందేశ్, రేగళ్ల కృష్ణ ప్రసాద్, రాంబాబు, నరేష్ తదితరులు ఉన్నారు.
తాతా మధు, చంద్రావతి సంతాపం
మదన్‌లాల్ మృతి అత్యంత బాధాకరమని, వైరా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మదన్‌లాల్ మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అమెరికా నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది. దశాబ్దానికి పైగా కలిసి పనిచేశామని, మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం
ఖమ్మం, మే 27: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ మృతికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలోని మదన్‌లాల్ ఇంటి వద్ద నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్ చేసి మదన్‌లాల్ కుమారుడు మృగేందర్‌లాల్‌తో మాట్లాడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మృగేందర్‌లాల్‌తో మాట్లాడుతూ ‘మీ తండ్రి మదన్‌లాల్ నాకు సన్నిహితుడు, నిబద్ధత కలిగిన మంచి నాయకుడు, ఆయన అకాల మరణం తీవ్ర బాధాకరం’ అని అన్నారు. మదన్‌లాల్ ఇక లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని, ఆయన మృతిచెందారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని మృగేందర్‌లాల్‌తో చెప్పారు. మృగేందర్ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తల్లి మంజుల, చెల్లెలు మనీషా లక్ష్మీలను ఓదార్చుతూ వారికి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా, కుటుంబానికి తాను, పార్టీ నాయకులు కొండంత అండగా ఉంటామని భరోసానిచ్చారు.
మదన్‌లాల్ ప్రస్థానం..
తొలుత వామపక్ష పార్టీల్లో పనిచేసిన మదన్‌లాల్ స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి. ఈర్లపూడి ఎంపీటీసీగా, సర్పంచ్‌గా పలు పర్యాయాలు పనిచేశారు. అనంతరం 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున వైరా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్లోకి మారారు. 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మదన్‌లాల్ బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. మదన్‌లాల్ కుమారుడు బానోతు మృగేందర్‌లాల్ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. కోడలు సైతం తమిళనాడు క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు. మదన్‌లాల్ ఆకస్మిక మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామం ఈర్లపూడి గ్రామం శోకసంద్రమైంది. మదన్‌లాల్ భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరంలోని అతడి ఇంటి వద్దకు తీసుకురాగా అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. మదన్‌లాల్ భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీమున్నీరుగా రోదించారు.
నేడు అంత్యక్రియలు
మదన్‌లాల్ స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్‌లాల్‌కు ఆరుగురు సోదరులు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు కాగా మదన్‌లాల్ మూడోవాడు. హైదరాబాద్ డీఎస్పీగా ఉన్న మదన్‌లాల్ సోదరుడు బానోతు జవహర్లాల్ మూడునెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం విదితమే. ఇప్పుడు మదన్‌లాల్ ఆకస్మిక మృతి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
ఈర్లపూడికి రానున్న హరీశ్‌రావు
మదన్‌లాల్ అంత్యక్రియలకు రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ ప్రతినిధిగా హాజరుకానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మంగళవారం తెలిపారు. హరీశ్‌రావుతోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలిపారు.