మణుగూరు టౌన్, మే 17: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నది బ్లాక్ మెయిలర్, చీటర్ అయిన తీన్మార్ మల్లన్న అని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. అతడు మరో నయీమ్ అని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మణుగూరు కిన్నెర కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాయకులు, కార్యకర్తలు సమష్టిగా శ్రమించి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్లాక్ మెయిలర్లకు బుద్ధి చెప్సాలంటే బీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మన రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అనంతరం పినపాక మండలం బీఆర్ఎస్ కార్యకర్త చిట్టిమల్ల సురేశ్ ప్రమాదశాత్తూ మరణించడంతో బాధిత కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పార్టీ ప్రమాద బీమా చెక్కును, గనిబోయిన గుంపులో నీటి తొట్టిలో పడి మృతిచెందిన బాలుడి కుటుంబానికి రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ నుంచి రూ.50 వేల సాయాన్ని అందజేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యేక లీగల్ సెల్ ఉందని, ఏ కార్యకర్తా అధైర్యపడొద్దని అన్నారు. నాయకులు కోలేటి భవానీశంకర్, పోశం నర్సింహారావు, సతీశ్‌రెడ్డి, ముత్యంబాబు, వట్టం రాంబాబు, అమరేందర్, నాగెల్లి వెంకట్, గాంధీ, సకిని బాబురావు, కుర్రి నాగేశ్వరరావు, ముద్దంగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.