అన్నదాతలు పొలంబాట వీడి పోరుబాట పట్టారు. జోరుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుమీదకు ఈడ్చిందంటూ ఆర్తనాదాలు చేశారు. కొంతమందికే పంటల రుణమాఫీ చేయడంతో మాఫీకాని రైతులు ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం పలుచోట్ల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగగా… ఒకచోట ఏకంగా ఏపీజీవీ బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలిపారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని, రైతులను ఇబ్బందిపెడితే ఏ ప్రభుత్వానికైనా భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. వ్యవసాయ పెట్టుబడులకే డబ్బులు లేక చస్తుంటే అప్పు ఎలా కట్టాలని, రూ.2 లక్షల పైన అప్పు కడితేనే రుణమాఫీ అంటే రైతుల ఉసురు తీసినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నదాతలు రోడ్డెక్కే దుస్థితి రాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకూ రుణమాఫీ చేసేవరకు ఆందోళనలు ఆపే ప్రస్తకేలేదంటూ ముక్తకంఠంతో నినదించారు.
– ఖమ్మం, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నాకు ఐదెకరాల 20 కుంటల భూమి ఉంది. యూనియన్ బ్యాంకులో లక్షా 70వేలు రుణం తీసుకున్నా. సహకార బ్యాంకులో 70వేలు తీసుకున్నా. మొత్తం 2.40 లక్షల రుణం ఉంది.. రెండు లక్షల వరకు మాఫీ చేస్తానన్నారు. పైన 40వేలు కట్టుకుంటాము మిగతావి మాఫీ చేయండని బ్యాంకువాల్లని అడిగితే మీది రుణమాఫీ అవ్వలేదని సమాధానం ఇచ్చారు. వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది మరొకటి… రుణమాఫీపై ఆశలు సన్నగిల్లాయి. డబ్బులు మాఫీ అయితే అప్పులు తొలిగి పోతాయనుకుంటే చివరికి నిరాశే మిగిలింది.
– సడియం వీరస్వామి, ములుగ్గూడెం, చుంచుపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షలకు పైగా ఉన్న డబ్బులు కడితేనే రుణమాఫీ అవుతుందని కొర్రీలు పెడుతోంది. గత కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి రైతుకు ఎన్ని లక్షలు అప్పు ఉన్నా రూ.లక్ష మాఫీ చేసింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా షరతులు లేకుండా రూ.2 లక్షలు మాఫీ చేస్తే బాగుంటుంది. నేను తీసుకున్న మొత్తానికి వడ్డీతో కలిపి రూ.2,00,908 కట్టాలన్నారు. జాబితాలో పేరున్నా రుణమాఫీ కావట్లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పని కావట్లేదు. తిరగడానికే రోజులు గడుస్తున్నాయి.
-చిట్టూరి నాగేశ్వరరావు, రైతు, వేంసూరు
ప్రభుత్వం రైతుల రుణమాఫీకి షరతులు విధించడం సరికాదు. ఎటువంటి షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు కండీషన్లు పెట్టడం బాధాకరం. రూ.2 లక్షల పైన ఉన్న రుణాలను చెల్లించాలంటే రైతులకు భారంగా మారుతుంది. పంట పెట్టుబడికి ఇంతవరకు రైతు భరోసా ఇవ్వకుండా ఇప్పుడు పై రుణాలను చెల్లిస్తేనే రుణం మాఫీ చేస్తామనడం విడ్డూరంగా ఉంది. రూ.2 లక్షలు పైన ఉన్న రైతులందరికీ నిబంధనలు లేకుండా పంట రుణాలు మాఫీ చేయాలి.
– వీరబోయిన వెంకటేశ్వర్లు, రైతు, మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అన్ని పత్రాలు ఇచ్చి బ్యాంకుల్లో రుణం తీసుకున్నాం. రుణం తీసుకునేప్పుడు అవసరం లేని రేషన్ కార్డు నిబంధన ఇప్పుడు ఎందుకు పెట్టారు. రూ.2 లక్షలకు పైగా రుణాలున్న వారి అర్హుల జాబితాను పూర్తిస్థాయిలో వెంటనే ప్రకటించాలి. రూ.2 లక్షల పైబడి ఒకటికి మించి బ్యాంకుల్లో రుణాలుంటే వారి పరిస్థితి ఏమిటి? ఇటువంటి గందరగోళ ప్రశ్నలు రైతుల్లో ఎన్నో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి.
-కూకలకుంట రవి, రైతు, ముష్టిబండ, దమ్మపేట మండలం