ఖమ్మం సిటీ, జూలై 27 : సీపీఆర్‌తో ఆపదలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించవచ్చని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) డాక్టర్ బీ మాలతి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని సీపీఆర్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మనిషి తన ఆరోగ్య పరిరక్షణ కోసం వ్యాయామం, ఆహారపు అలవాట్లను మార్చుకుని, స్వచ్ఛమైన గాలి, నీరు తీసుకోవాలని సూచించారు. 30 సంవత్సరాలు దాటిన వారంతా ఏడాదికోసారి హెల్త్ ప్రొఫైల్‌ను చెక్ చేసుకోవాలన్నారు.
ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో పనులు చేసేవిధంగా అలవాట్లు చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు. ప్రతి ఉద్యోగి ఖాళీ సమయాల్లో ఉశ్చాస, నిశ్చాస ప్రక్రియలో నిమగ్నమవుతూ మెడిటేషన్ చేసుకుంటూ ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి దూరంగా ఉండాలన్నారు. ఇంటి దగ్గర, వచ్చిపోయే దారిలో, కార్యాలయాల్లో ఎవరికైనా హార్ట్ఎటాక్ వస్తే వర్క్‌షాప్‌లో నేర్చుకున్న విధంగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. డీటీసీవో డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ సీపీఆర్ పట్ల అవగాహన లేనందున ప్రపంచ వ్యాప్తంగా క్యాజువాలిటీ కేసుల్లో 1.5 మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
దేశంలో 98శాతం మందికి సీపీఆర్ తెలియనందున చిన్న వయస్సులోనే గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఇటీవల ప్రతి వందమందిలో 10 నుంచి 20 మందికి గుండె సమస్యలు తలెత్తుతున్నాయని, ఏపీజే అబ్దుల్‌కలాం వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వైద్య ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు నిమిషాల్లో ఐదు షెట్లు, ఒక్కోదానికి 30దఫాలు ఛాతి మీద రెండు చేతులతో కంప్రెషన్ ఇస్తూ మనిషి నాడీ వ్యవస్థ, శ్వాసరేటును గమనించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బాలకృష్ణ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వగా, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష, డిఫ్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సైదులు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామారావు, డాక్టర్ భాస్కర్, డాక్టర్ రమణ, డాక్టర్ మోతియా, డెమో కాశీనాథ్ పాల్గొన్నారు.