వైరా టౌన్, జూన్ 23: వైరా మున్సిపాలిటీలోని మధిర రోడ్డు త్వరలో సర్వాంగ సుందరంగా ముస్తాబు కాబోతోంది. ఈ మేరకు వైరా ఎమ్మెల్యే రాములునాయక్ కృషితో మంజూరైన సుమారు రూ.12 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో మధిర రోడ్డులో సెంట్రల్ లైటింగ్, డివైడర్లతోపాటు రోడ్డు విస్తరణ పనులను చేపట్టనున్నారు. టెండర్ ప్రక్రియను త్వరలో వేగవంతంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైరా రింగ్ సెంటర్ నుంచి మధిర రోడ్డులోని సోమవరం గ్రామం వద్ద ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవే వరకు సుమారు 1.7 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్, డివైడర్, డ్రైనేజీ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏన్కూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సుమారు 0.55 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణం కోసం సుమారు రూ.3 కోట్లు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాములునాయక్ తెలిపారు.
వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన వైరాను అత్యంత సుందర పట్టణంగా, ఖమ్మానికి దీటుగా తీర్చిదిద్దుతాం. సీఎం కేసీఆర్ కూడా వైరా మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా చేసి అధిక నిధులు కేటాయిస్తున్నారు. రానున్న రోజుల్లో వైరాను పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దుతాం.
-వైరా ఎమ్మెల్యే రాములునాయక్