ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 18 : విద్యార్థులకు చదువుతోపాటు ఆకలి కేకలు లేకుండా చేసేందుకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ఒక్కరోజు మాత్రమే నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మిగిలిన రోజుల్లో నీళ్ల చారు, ఉడికీ ఉడకని అన్నం, అమలుకాని మెనూ మధ్యాహ్న భోజనంలో దర్శనమిస్తున్నాయి.
కలెక్టర్గా ముజమ్మిల్ఖాన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారంలో ఒకరోజు జిల్లా అధికారులు ప్రతి బుధవారం మండలంలోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు బుధవారం రోజు మాత్రం పక్కాగా మెనూతోపాటు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రుచికరమైన భోజనం బుధవారం ఒక్కరోజు అందిస్తే సరిపోతుందా.. అని ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కడ అవకాశం ఉన్నా పాఠశాలలను సందర్శించడంతోపాటు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారు. ఇవన్నీ సర్కార్ స్కూల్స్ పట్ల తనకున్న ప్రత్యేక శ్రద్ధను స్పష్టం చేస్తున్నాయి.
సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి విద్యార్థుల హాజరు నూరుశాతం ఉండేందుకు కృషి చేయడంతోపాటు ఉపాధ్యాయుల హాజరు కూడా నూరుశాతం ఉండాలని పదేపదే చెబుతుండడం కలెక్టర్ మార్కును చూపిస్తున్నది. రేపటి నవభారత నిర్మాతలను తయారుచేసేది స్కూల్స్ అని బలంగా విశ్వసిస్తున్నట్లు అన్ని విభాగాల కంటే మిన్నగా విద్యాశాఖపై దృష్టి పెడుతుండడం తేటతెల్లమవుతున్నది.
జిల్లాస్థాయి అధికారులు ప్రతి మండలంలోని ఒక పాఠశాలను ప్రతి బుధవారం తప్పనిసరిగా సందర్శించి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 21 మండలాల్లో ఒక్కో అధికారి ఒక్కో పాఠశాలలో భోజనం చేసి దానిపై డీఈవో కార్యాలయానికి వారి అభిప్రాయాన్ని తెలపాలి. మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షించడంతోపాటు నాణ్యతను పెంచడానికి భోజనం వడ్డించే సమయానికి స్వయంగా వెళ్లి పాల్గొనాలని సూచించారు.
వంటపాత్రలు, వంటగది, ఆహార పదార్థాలు పరిశీలించాలి.. మెనూ అమలు చేస్తున్నారా..? వారంలో మూడ్రోజులు గుడ్లు అందిస్తున్నారా అనే వివరాలు విద్యార్థులతో కూడా మాట్లాడి తెలుసుకోవాల్సి ఉంది. కలెక్టర్ ఆశయం ఘనంగా ఉండగా దానిని క్షేత్రస్థాయిలో అమలుపర్చాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆశయం నీరుగారిపోతున్నది.
ఆగస్టులో నాలుగు బుధవారాలను
అధికారులు మధ్యాహ్న భోజన పరిశీలన కార్యక్రమాన్ని ఎంతో పరిశీలించాం అన్నట్లుగా సాగుతుంది. 21 మండలాల్లో అధికారులు ఇప్పటివరకు ఎవరూ సందర్శించనివి చాలా ఉన్నాయి. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న 30 లేదా 40 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలైన ఖమ్మం నగరం, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, చింతకాని, కొణిజర్ల, వైరా, కారేపల్లి, కామేపల్లి, కూసుమంచి మండలాల్లో మాత్రమే సందర్శిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కొందరు అధికారులు మాత్రం మొదటి నుంచి క్రమం తప్పకుండా పరిశీలిస్తున్న వారు ఉన్నారు.
బుధవారంతోపాటు మిగిలిన రోజుల్లో కూడా నాణ్యత పెంచేలా భోజనం అందించాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నగరంలో కొంతమేరకు బాగుంటున్నా, గ్రామీణ ప్రాంతాల్లో మెనూ చాలావరకు అమలు కావడం లేదనేని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలాచోట్ల నీళ్ల చారు, ఉడకని అన్నం అందుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.