ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం వైభవోపేతంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు పట్టణంలోని మిథిలా స్టేడియంలో ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
భద్రాచలం, డిసెంబర్ 11 : భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత రామచంద్రమూర్తి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మిథిలా స్టేడియంలో ఈనెల 22వ తేదీ వరకు ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 13న మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు భద్రాచలం కృష్ణ ప్రేమ కోలాట భజన మండలి వారిచే భజన పాటలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కపిళేశ్వరపురానికి చెందిన ఎన్.నాగలక్ష్మిచే హరికథా కాలక్షేపం ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన ఎన్.శిరీష నృత్య ప్రదర్శన, 5.30 నుంచి 6 గంటల వరకు చెన్నూరుకు చెందిన వి.కవితా సత్యమూర్తిచే సంగీత కార్యక్రమం, సాయంత్రం 6 నుంచి 6.30 వరకు చెన్నైకు చెందిన అపర్ణ సుదీప్చే కూచిపూడి నృత్య ప్రదర్శన, సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన ఎన్ఎస్.మీనాక్షిచే సంగీత కార్యక్రమం ఉంటుంది.
రాత్రి 7 నుంచి 7.30 వరకు వరంగల్‌కు చెందిన శ్రీనిధి కల్చరల్ సేవా సొసైటీ వారిచే కూచిపూడి నృత్యం ఉంటుంది. రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు చెన్నైకు చెందిన తెలుగు తరిణిచే సంగీతం, రాత్రి 8 నుంచి 8.30 వరకు భద్రాద్రి సాంస్కృతిక వారధి వారిచే కూచిపూడి నాట్య ప్రదర్శన, రాత్రి 8.30 నుంచి 9.15 గంటల వరకు బెంగుళూరుకు చెందిన శైలజా పంతులు వారి బృందంచే సంగీత కచేరి, రాత్రి 9.15 నుంచి 11 గంటల వరకు పర్చూరు శ్రీ నాగాంజనేయ నాట్య మండలి వారిచే శ్రీకృష్ణ రాయబారం నాటక ప్రదర్శన ఉంటుంది. 14న కూర్మావతారం, 15న వరాహావతారం, 16 నారసింహావతారం, 17న వామనావతారం ఉంటుంది. 18న పరుశురామావతారం, 19న శ్రీరామావతారం, 20న బలరామావతారం, 21న శ్రీకృష్ణావతారం, 22న గోదావరిలో సీతారాములకు జల విహారం (తెప్పోత్సవం) పటాకుల మోతల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే 23న భక్తులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం నేత్రపర్వంగా జరుపనున్నారు.