ఈ నెల 30న మధిరలో రైతు ఆశీర్వాద సభను ఏ ముఖం పెట్టుకొని నిర్వహిస్తున్నారో సీఎం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతుభరోసా, రుణమాఫీ వంటివి ఎగ్గొట్టిన ప్రభుత్వం.. ఆ సభ పేరును ‘రైతు ఆశీర్వాద సభ’ అని కాకుండా ‘రైతు క్షమాపణ సభ’గా పేరుమార్చుకొని రైతులను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్, జూన్ 23: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నాయకుడు తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక స్కీములను అమలు చేసిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నీ స్కాములే చేస్తోందని దుయ్యబట్టారు. సింగరేణిలో స్కాం, సింగరేణి బొగ్గులో స్కాం, విద్యుత్‌లో స్కాం, చివరికి ప్రతిదాంట్లోనూ స్కాములు జరుగుతున్నాయని ఆరోపించారు.
అందుకే ఈ స్కాముల ప్రభుత్వాన్ని పారదోలి స్కీముల ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పుడిదే తెలంగాణ ప్రజల అభిమతమని అన్నారు. ప్రజలను కలవడం లేదంటూ అప్పటి సీఎం కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఈ రెండున్నరేళ్లలో ప్రజలను ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.100 కోట్లతో క్యాంపు కార్యాలయాలు కట్టుకొని కమీషన్లు తీసుకోవడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అంశాలపై భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
అన్నింటా ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఢిల్లీకి మూటలు మోసి తన కుర్చీని కాపాడుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ రెండున్నరేళ్లలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని, ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. స్వయంగా అతడి వద్దనున్న హోం, ఎడ్యుకేషన్, మున్సిపల్ శాఖల నిర్వహణలోనూ పూర్తి వైఫల్యం కనబడుతోందని స్పష్టం చేశారు. ఫీజుల నియంత్రణలో, శాంతిభద్రతల పరిరక్షణలో, కనీస పారిశుధ్య నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.
చివరికి, రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం నమ్మక ద్రోహానికి చిరునామాగా మిగిలిందని ధ్వజమెత్తారు. తనను నమ్మి ఓటేసిన ప్రతి వర్గాన్నీ నమ్మించి మోసం చేయడంలో మాత్రం రేవంత్ విజయం సాధించారని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు పోటీపడి మరీ హామీలిచ్చారని, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టారని గుర్తుచేశారు. భట్టి విక్రమార్క మరో అడుగు ముందుకేసి ఇంటింటికీ కార్డులు పంచారని, వాటిని భద్రపర్చుకోవాలంటూ భరోసా కూడా ఇచ్చారని జ్ఞప్తికి తెచ్చారు. మరి ఆ హామీల్లో ఎన్నింటిని అమలు చేశారో, ఆ కార్డులు ఇప్పుడు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
అందాల పోటీలకు, ఫుట్‌బాల్ పోటీలకు, మూసీ సుందరీకరణకు, పత్రికల్లో రోజూ ఫొటోలు వేయించుకునేందుకు ఈ ప్రభుత్వం వద్ద డబ్బులుంటాయిగానీ అవ్వాతాతలకు పింఛన్లు పెంచడానికి; అన్నదాతల సంక్షేమ పథకాలకు డబ్బులెందుకు ఉండవని హరీశ్‌రావు ప్రశ్నించారు. అసలు సమస్య ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం కాదని, సీఎం రేవంత్‌రెడ్డికి మనసు లేకపోవడమేనని తేల్చిచెప్పారు. అలాగే, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చాక.. వేధించిన అధికారి ప్రతి పేరూ గుర్తుంచుకుంటామని అన్నారు. వచ్చే తమ ప్రభుత్వంలో కార్యకర్తల ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పక్కాగా ప్రతిపక్ష పాత్ర పోషించిందని; ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం గల్లా పట్టి కొనుగోలు చేసేలా చేసిందని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ఈసారి ప్రతిపక్షంలో ఉండదని సీఎం రేవంత్‌రెడ్డే చెబుతున్నారంటే బీఆర్ఎస్ ఈసారి పాలకపక్షంలో ఉంటుందని ఆయనకు ఇప్పటికే అర్థమైందని తేల్చిచెప్పారు. ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లను తొలగించకుండా చూడాలని సూచించారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఈ సభకు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బెల్లం వేణు, రావు జోగేశ్వరరావు, పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన ఏ వాగ్దానాన్నీ నెరవేర్చలేని చేతగాని ప్రభుత్వంగా ప్రజల్లో మిగిలిపోయిందని విమర్శించారు. గత ఏడాది ఆగస్టులో రైతులందరికీ రైతుభరోసా వేస్తామని అందరి దేవుళ్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పటివరకు మూడుసార్లు పంటల పెట్టుబడికి ఎగనామం పెట్టారని గుర్తుచేశారు. పైగా, దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ధాన్యానికి ఇచ్చిన బోనస్ మూడు రైతుభరోసాలతో సమానమంటూ జూపల్లి వ్యాఖ్యానించడం అతడి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. రైతుభరోసా పేరుతో ఇప్పటివరకు రూ.29,500 కోట్లు ఎగొట్టిన ప్రభుత్వం.. బోనస్ రూపంలో ఇచ్చింది కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. ఈ నిజాలు తెలుసుకోకపోతే ఎవరు బాధ్యులంటూ ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు మొనగాడిగా బిల్డప్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. ఎన్నికలై అధికారంలోకి రాగానే మోసగాడిగా తన స్వరూపాన్ని ఓట్లేసిన ప్రజలకు చూపెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కరోనా కష్టకాలంలో కూడా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాలు సైతం ఆపి.. తొలివర్షం పడిన రోజే రైతులకు రైతుబంధు వేశామని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం యూరియాను యాప్‌ల్లో చూపిస్తూ షాపుల్లో స్టాక్ లేకుండా చేస్తోందని విమర్శించారు. ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలే ఇస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని, రైతులను ఏం చేద్దామనుకుంటోందని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ప్రకృతి విలయతాండవం చేసి రైతులకు పంటనష్టం జరిగితే ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం ఇస్తానన్న ప్రభుత్వం.. ఇంతవరకు రూపాయి కూడా చెల్లించలేదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బడ్జెట్లో భారీస్థాయిలో అంకెలు చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఎవరికీ విడుదల చేయలేదని ఆరోపించారు. 30న మధిర సభలో రేవంత్‌ను ఎందుకు ఆశీర్వదించాలో కాంగ్రెస్ వారే చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఇన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పాలకులను రైతులు ఏమని ఆశీర్వదిస్తారని ప్రశ్నించారు.