తల్లాడ, జనవరి 6: పసిగుడ్డుగా ఉన్న తెలంగాణను ఏడేళ్లలోనే అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించేందుకు కేసీఆర్ నిత్యం తపనపడేవారని గుర్తుచేశారు. విద్యుత్‌తోపాటు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చి అన్నదాతలకు ఆత్మబంధువులా నిలిచారని కొనియాడారు. తల్లాడ మండలంలోని కుర్నవల్లి, ఉమ్మడి దేవరపల్లి రాష్ట్రీయ రహదారికి రూ.6.40 కోట్లు, తల్లాడ – మల్లవరం నుంచి గంగిదేవిపాడుకు రూ.9 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లవరం, కుర్నవల్లి గ్రామాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గానికి నెల రోజుల వ్యవధిలోనే రూ.వంద కోట్ల నిధులు మంజూరయ్యేలా చేసిన నాయకుడు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. నిధుల మంజూరు కోసం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తా ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు గంటా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, దుగ్గిదేవర సామ్రాజ్యం, అయిలూరి లక్ష్మి, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, అన్నెం కళావతి, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, దిరిశాల దాసురావు, వనిగండ్ల అలేఖ్య, పాలేరు రామారావు, పసుమర్తి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.