ఖమ్మం అర్బన్, నవంబర్ 10: ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా చైతన్య జైనీ నియమితులయ్యారు. కరీంనగర్ డీఈవోగా పనిచేస్తూ సెలవుల్లో ఉన్న ఆమెను ఖమ్మం డీఈవోగా నియమిస్తూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీఈవోగా నియమితులు కావడానికి ముందు మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పౌజ్ డిప్యూటేషన్‌పై పనిచేశారు.
అంతకుముందు యాదాద్రి జిల్లా డీఈవోగానూ విధులు నిర్వర్తించారు. ఖమ్మంలో 2022లో డీఈవోగా పనిచేసిన యాదయ్య సెలవులో వెళ్లిన తర్వాత ఎవరూ రెగ్యులర్ డీఈవోలుగా నియమితులు కాలేదు. తర్వాత నియమితులైన సోమశేఖరశర్మ, సామినేని సత్యనారాయణలు డైట్ కళాశాల లెక్చరర్లు. వారినే ఇన్చార్జి డీఈవోలుగా ఉన్నతాధికారులు నియమించారు. తొలుత, సోమశేఖరశర్మ, తర్వాత సామినేని సత్యనారాయణలు ఇన్చార్జి డీఈవోలుగా కొనసాగారు.
వరుసగా వారు కూడా ఒకరితర్వాత మరొకరు ఉద్యోగ విరమణ చేయడంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి ఖమ్మం అదనపు కలెక్టర్ డాక్టర్ పీ.శ్రీజ ఖమ్మం డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్.. విద్యాశాఖ కార్యదర్శితో చర్చించారు. ఖమ్మానికి రెగ్యులర్ డీఈవోను నియమించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే చైతన్య జైనీని ఖమ్మం జిల్లాకు రెగ్యులర్ డీఈవోగా నియమించారు.