ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 20: బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల పాలనను వికేంద్రీకరించడంతో చిన్న పంచాయతీలన్నీ అద్భుత పురోగతి సాధిస్తున్నాయి. పెద్ద పంచాయతీల నుంచి విడిపోయి చిన్న పంచాయతీలుగా ఆవిర్భవించిన గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇల్లెందు మండలంలోని మొండితోగు గ్రామ పంచాయతీకి మహర్దశ పట్టింది. దీంతో ఆ గ్రామంలో అభివృద్ధి మెరుగవడంతో సౌకర్యాలు, సదుపాయాలు సమకూరాయి. గ్రామం నిండా సీసీ, బీటీ రోడ్లు ఏర్పాటయ్యాయి.. నిత్యం పారిశుధ్య పనులు జరుగుతుండడంతో సీజనల్ వ్యాధుల జాడే లేకుండా పోయింది. పల్లెప్రకృతివనాలతో గ్రామం ఆహ్లాదంగా రూపుదిద్దుకుంది. డంపింగ్యార్డు ఏర్పాటుతో వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి. క్రీడా ప్రాంగణం ఏర్పాటుతో యువత క్రీడల్లో నిమగ్నమయ్యారు. పల్లె దవాఖాన ఏర్పాటు కావడంతో స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
చిన్న పంచాయతీలతో అద్భుత అభివృద్ధి..
చిన్న పంచాయతీగా ఏర్పడిన ఇల్లెందు మండలం మొండితోగు గ్రామంలో అద్భుత అభివృద్ధి జరుగుతోంది. గతంలో రొంపేడు పంచాయతీలో ఉన్న మొండితోగు గ్రామాన్ని పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా చిన్న పంచాయతీగా విభజించారు. దీంతో మొండితోగు, చెరువుకట్ట ఏరియా ప్రాంతం, ధర్మాపురం గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన దగ్గరి నుంచి మొన్నటి వరకూ ఈ గ్రామాలు పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు చిన్న పంచాయతీగా ఆవిర్భవించడంతో పారిశుధ్యం, రహదారుల సౌకర్యాల వంటివన్నీ మెరుగయ్యాయి. 1,637 మంది జనాభా కలిగిన ఈ పంచాయతీలో కేవలం సీసీ రోడ్ల నిర్మాణాలకే రూ.35 లక్షల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. రూ.30 లక్షల డీఎంఎఫ్ నిధులతో ఆరు సీసీ రోడ్లను చేపట్టగా.. రెండు పూర్తయ్యాయి నాలుగు సీసీ రోడ్ల పనులు తుది దశలో ఉన్నాయి. సీఎం ఫండ్ నుంచి రెండు సీసీ రోడ్లను రూ.10 లక్షలతో పూర్తి చేశారు. ఎంపీటీసీ నిధుల నుంచి రూ.10 లక్షలతో సీసీ రోడ్లు మంజూరయ్యాయి. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద రూ.50 లక్షల నిధులు మంజూరు కాగా.. అందులో ప్రహరీ నిర్మాణానికి రూ.30 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.7 లక్షలను వెచ్చించారు. అలాగే, ధర్మాపురం ‘మన ఊరు – మన బడి’కి రూ.13 లక్షలు మంజూరయ్యాయి. అలాగే, ఇటీవల మొండితోగు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు కాగా ఎమ్మెల్యే హరిప్రియ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఇక రూ.12 లక్షలతో మొండితోగు పల్లె దవాఖానను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక సీహెచ్వోతోపాటు ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశాలు ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో పంచాయతీ అభివృద్ధి
స్వాతంత్రం వచ్చిన దగ్గరి నుంచి మా మొండితోగు పంచాయతీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. గతంలో రొంపేడు గ్రామ పంచాయతీలో మా మొండితోగు గ్రామం ఉండేది. చిన్న పంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన సీఎం కేసీఆర్.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మా గ్రామాన్ని చిన్న పంచాయతీగా చేశారు. దీంతో మొండితోగు పంచాయతీ రొంపేడు నుంచి వేరుగా ఏర్పాటైంది. ఇప్పుడు మొండితోగు పంచాయతీలో ధర్మాపురం, చెరువుకట్ట ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు మొండితోగు పంచాయతీ.. సీసీ రోడ్లతోపాటు పల్లె దవాఖాన, పారిశుధ్యం, పచ్చదనంతోపాటు నూతన కళను సంతరించుకున్నాయి. ఎంతో ప్రగతిని సాధించింది.
-చీమల వీరభద్రం, సర్పంచ్, మొండితోగు పంచాయతీ, ఇల్లెందు