కరకగూడెం, జూన్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల వృక్షాలు నెలకొరిగాయి. ఈదురు గాలులకు మండలంలోని శ్రీరంగాపురం గ్రామంలో ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడి పగిలిపోయాయి. ఇదే గ్రామంలో భారీ వృక్షం కూకటివేళ్లతో ఓ ఇంటిపై కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే రేగుళ్ల గ్రామంలో మామిడి చెట్టు కింద నిలిపిన రైతుల రెండు ట్రాక్టర్లపై విపరీతమైన గాలికి మామిడి చెట్టు కూలడంతో రెండు ట్రాక్టర్ల ఇంజన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రకృతి వైపరీత్యంతో జరిగిన ప్రమాదం వల్ల ట్రాక్టర్ తోలుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరాయి. పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొంతమేర ఆస్తి నష్టం వాటిల్లింది.

శ్రీరంగాపురంలో గాలివాన బీభత్సం.. నేలకూలిన చెట్లు, ఎగిరిపోయిన ఇంటి పైకప్పు