బూర్గంపహాడ్, ఆగస్టు 24 : బూర్గంపహాడ్లోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయని సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, వీబీ.చారి, సింగనబోయిన వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఐటీసీ సహకారంతో లక్షల రూపాయలతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను సోమవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిత్యం వందలాది మంది ప్రయాణీకులు తాసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి పోతుంటారని, అత్యవసర సమయంలో మూత్ర విసర్జన చేయాలంటే మరుగుదొడ్లు ఏర్పాటు చేసినా సౌకర్యాలు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా మరుగుదొడ్లను వాడకంలోకి తెచ్చి నీటి సదుపాయం, ఇతర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.