రామవరం, ఏప్రిల్ 09 : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 దరఖాస్తు గడువు ఈ నెల 15 వరకు పొడిగించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం తెలిపారు. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన వారికి స్టైపెండ్ కింద ముందుగా రూ.6 వేలు అనంతరం ప్రతీ నెల రూ.5 వేల చొప్పున కేంద్రం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీ చదివిన వారికి అవకాశం అన్నారు. 21 నుండి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగి, సంవత్సర ఆదాయం ర.8 లక్షల లోపు ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు.
దేశంలోని 500 ప్రసిద్ధ కంపెనీలు ఇంటర్న్‌షిప్ భాగస్వాములుగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో దశలో 5,357 మందికి ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల యువత తమ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉన్న ఫోన్ నంబరుతో ఈ నెల 15 లోపు తమ వివరాలు pminternship.mca.gov.in వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్న్‌షిప్ నకు ఎంపికైన వారికి తాము నివసిస్తున్న ప్రాంతంలోనే ఒక సంవత్సరం పాటు అవకాశం కల్పిస్తారని, కావున ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.