బూర్గంపహాడ్, మే 15 : రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి పనిచేసినా కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారిందని బూర్గంపహాడ్ పంచాయతీ స్వీపర్లు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ప్రతిరోజూ గ్రామంలో చెత్తను ఎత్తి డంపింగ్ యార్డులకు తరలిస్తామని, ఏ రక్షణ పరికరాలు లేకుండా కాల్వలు శుభ్రం చేస్తున్నామని, రోజు చాకిరీ చేసినా ఇచ్చే వేతనం రూ.9,500 మాత్రమేనని, అవి కూడా సకాలంలో విడుదల కాకపోవడం.. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ, ఆర్ధికపరంగా నానా అవస్థలు పడుతున్నామని స్వీపర్లు ఆవేదన వెలిబుచ్చారు. ఆయా పంచాయతీల్లో జనరల్ ఫండ్ నుంచి పాలకులు ఇవ్వాల్సి ఉన్నా నిధులు లేక జీతాలు చెల్లించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నా అందులో నిజంలేదని ఆరోపించారు.
గత సర్పంచుల పదవీకాలం ముగిసిన వెంటనే పంచాయతీ పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లిన సమయాన్ని ఆసరా చేసుకుని భారీగా నిధులు ఖర్చు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి రికార్డులో చూపించారని, అభివృద్ధి పనులు జరగక పోయినా జరిగినట్లు చూపిస్తూ లక్షల నిధులు ఖర్చు చేసినట్లు ఆరోపణలు బూర్గంపహాడ్ పంచాయతీలో ఉండటంతో నిధుల లావాదేవీలు నిలుపుదల చేయడంతో తమకు రెండు నెలలుగా జీతాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నామని స్వీపర్లు అరిగోస పడుతున్నారు.
రెండు నెలలుగా స్వీపర్లకు జీతాలు అందక కుటుంబపరంగా, ఆర్ధికపరంగా నానా అవస్థలు పడుతున్నారు. బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల గోల్ మాల్ నేపథ్యంలో లావాదేవీలు నిలిపివేయడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని, అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పంచాయతీలో స్వీపర్లకు వేతనాలు చెల్లించాలి.