– కొత్తగూడెం ఏరియా జీఎం సీ.హెచ్. వెంకటరమణ
రుద్రంపూర్, ఆగస్టు 24 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలో ఈ నెల 25, 26 రెండు రోజుల పాటు సామాజిక చైతన్య నాటికోత్సవాలను నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జీఎం సీ.హెచ్.వెంకటరమణ సోమవారం తెలిపారు. ఈ నెల 25న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవితం, ఆశయాల ఆధారంగా “సంఘం శరణం గచ్చామి”, 26న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం, ఆశయాల ఆధారంగా “సత్యశోధన” నాటకాలను ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ రెండు నాటకాలు సాయంత్రం 6:30 గంటలకు కొత్తగూడెం గౌతంపూర్ కమ్యూనిటీ హాల్లో ప్రదర్శించబడతాయని చెప్పారు. అద్భుతమైన వేదికా రూపకల్పన, ఆకట్టుకునే సన్నివేశాలు, కళాకారుల ప్రతిభతో ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నట్లు వెల్లడించారు. సామాజిక సంస్కర్తల జీవితాలు, వారి ఆశయాలను ప్రజలకు పరిచయం చేసే ఈ కార్యక్రమాలకు సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, కళాభిమానులు, యువత అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జీఎం కోరారు.