ఇల్లెందు, మే 22 : మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావును ఒడిశాలో అరెస్ట్ చేసి బూటకపు హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లుతున్నారని ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు డి.ప్రసాద్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం టేకులపల్లి మండల కేంద్రంలో భూక్య నర్సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. బూటకపు హత్యలు చేసి చంపిన 28 మందిలో ఆదివాసీలు, మావోయిస్టు పార్టీ సభ్యులు, నాయకులు ఉన్నట్లు తెలిపారు. 55 రోజులుగా కాల్పుల విరమణకు శాంతి చర్చలు చేయాలని శాంతి చర్చల కమిటీ, అనేక పార్టీలు, సంస్థలు, ప్రజలు గొంతెత్తి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వరుసగా దాడులు చేస్తూ ప్రజా నాయకులను చంపడం మానవత్వానికి, శాంతికి తీవ్రమైన విఘాతం అన్నారు.
మావోయిస్టు పార్టీ నుండి ఆరు లేఖలు, ఒక ఇంటర్వ్యూ ద్వారా శాంతి చర్చలకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ఆయుధ విసర్జన, జనజీవన స్రవంతిలో కలిసే విషయం సైతం తమ కేంద్ర కమిటీ చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని, దానికి అనుకూలంగా రెండు మూడు నెలలైనా కాల్పుల విరమణ ప్రకటించమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కానీ పాలక ప్రభుత్వాలు నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. ఈ విషయమై ప్రజలు, ఆదివాసీలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, అన్ని పార్టీల శ్రేణులు ఆలోచించి ఉద్యమాలకు పూనుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షుడు ఎట్టి నరసింహారావు, పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్, శంకర్, భూక్య నర్సింగ్ పాల్గొన్నారు.