చుంచుపల్లి, ఆగస్టు 28 : రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. చుంచుపల్లిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో వారి చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో ధర్నాలు చేయడం కాకుండా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సుమారు రూ.1,500 కోట్ల నిధులు విడుదల చేయించాలని సూచించారు. ఫీజు బకాయిలను వెంటనే చెల్లించకపోతే విద్యార్థుల పక్షాన జేబీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేబీపీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరునాయక్, వినయ్, సోనూ, శంకర్ పాల్గొన్నారు.