బూర్గంపహాడ్, మార్చి 23 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణ పనులను గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయాన్ని గ్రామ ప్రజలు వ్యతిరేకించారు. ఆ స్థలంలో కాకుండా గ్రామానికి చివరన ఈ నిర్మాణం చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రానికి గర్భిణులు, చిన్నారులు, బాలింతలు నిత్యం వస్తుంటారని, ఈ సెల్ టవర్ నిర్మాణం కారణంగా రేడియేషన్ ప్రభావం ఉండటంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ గ్రామస్తులు అడ్డు చెప్పారు. సోమవారం సెల్ టవర్ నిర్మాణ పనుల్లో భాగంగా టవర్ పునాది పనులను చేపట్టేందుకు యంత్రాలతో వచ్చిన నిర్వాహకులను గ్రామస్థులు అడ్డుకుని పనులు నిలిపివేశారు. జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మిస్తే ఊరుకునేది లేదని, ఈ ప్రాంతంలో కాకుండా జనావాసాలు లేనిచోట టవర్ నిర్మించాలని, ఇక్కడ నిర్మాణం చేపడితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో నిర్వాహకులు పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.