రామవరం, ఏప్రిల్ 12 : చైత్ర శుద్ధ పూర్ణిమ శనివారం సందర్భాన్ని పురస్కరించుకుని రుద్రంపూర్లో కొలువైన గుండాల సాయమ్మ తల్లికి చుక్కబోనం, ఘటంకుండ కార్యక్రమాలు నిర్వహించారు. పూజారి రవికుమార్ ఆధ్వర్యంలో రుద్రంపూర్ లోని సీతారామచంద్ర దేవాలయం నుండి బోనాలు, శివశక్తుల పూనకాలతో, డప్పు వాయిదాలతో అమ్మవారి నైవేద్యమైన చుక్క బోనాన్ని అమ్మవారిని సమర్పించేందుకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి గుడి వద్దకు కాలినడకన వెళ్లి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా పూజారి రవికుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి విగ్రహం 9వ ఇంక్లైన్ గ్రామంలో మట్టిలో కూరుకుపోయి ఉండగా అమ్మవారి వాక్కును అందుకున్న తాను రుద్రంపూర్ రెండు వజ్రాల కొండల నడుమ దాదాపు 25 ఏండ్ల క్రితం అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ, సేవ చేస్తున్నట్లు తెలిపారు. పెనగడప మహాలక్ష్మీమ్మ, రాఘవపురం అంకమ్మతల్లి, గుండాల సాయమ్మ తల్లి అక్కా చెల్లెళ్లు. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందన్నారు. శనివారం ఉదయం పంచ లోహలతో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి పూజారులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కలు చెల్లించుకున్నారు.
Gundala Saiyamma Thalli : అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే