మధిర : బోనకల్లు గ్రామానికి చెందిన మిలటరీలో పని చేసే బూదాల మనోజ్ పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి చేశామని వైరా ఏసీపీ రెహమాన్(ACP Rahman) శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. చింతకాని మండలం నాగులవంచలోని పెట్రోల్ బంక్లో జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా.. ఫిబ్రవరి 11 న చింతకాని పోలీస్ స్టేషన్ కు వచ్చిన తనపై అక్కడే ఉన్న గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన ఉమ్మినేని రమేష్, చింతకానికి చెందిన లగడపాటి సాయి అనే వ్యక్తులు స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశాడన్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఉమ్మినేని రమేష్, లగడపాటి సాయి అనే ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(SC, ST Atrocities) నమోదు చేశామన్నారు. ఈవిషయమై ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పూర్తి నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని ఏసీపీ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించమని పేర్కొన్నారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.