కారేపల్లి (ఖమ్మం), డిసెంబర్ 15 : విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యతను పెంచుకుంటే జీవితంలో విజయాలు సొంతం అవుతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పోలేపల్లి షిరిడి సాయినాథ్ నగర్ భద్రాద్రి కాలనీలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్ను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అత్యున్నత విద్యను ప్రభుత్వ రంగంలో అందించే సంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలకు మంచి పేరు ఉందన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం కలెక్టర్గా తనకు అనేక దరఖాస్తులు వస్తాయని, ఈ విద్యాలయంలో చదవాలని బయట మంచి డిమాండ్ ఉందన్నారు.
కేంద్రీయ విద్యాలయాల్లో చదివేందుకు అవకాశం వచ్చిన ప్రతి విద్యార్థి అదృష్టవంతుడని, చిన్నతనంలో తనకు ఇటువంటి మంచి విద్యాలయాల్లో చదువుకునే అవకాశం లభించలేదని కలెక్టర్ తెలిపారు. మన దగ్గర ఉన్న సదుపాయాలను ఎంత మెరుగ్గా వినియోగించుకుంటామనే దానిపై మన సక్సెస్ ఆధారపడి ఉంటుందన్నారు. కేంద్రీయ విద్యాలయంలో చదివే విద్యార్థులు క్రీడల్లో, అకడమిక్స్ లో సమాంతరంగా రాణిస్తున్నారని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి సమగ్ర అభివృద్ధికి కేంద్రీయ విద్యాలయాలు దోహద పడుతున్నాయన్నారు. జీవితంలో మనం విజయాల వెనుక పరిగెత్తవద్దని, మనకు ఆసక్తి ఉన్న రంగాల్లో విశిష్టమైన నైపుణ్యత పెంచుకుంటే విజయాలు వాటంతటవే మనను వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు.

Karepally : నైపుణ్యతతో విజయాలు సొంతం : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు సైతం ఒకే రోజు గొప్పవారు కాలేదని, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ తమ నైపుణ్యతకు పదును పెట్టడం వల్ల అనేక విజయాలు సాధించారని గుర్తు చేశారు. వారి నుంచి మనం ఆ స్ఫూర్తి నేర్చుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఎల్లప్పుడూ ఏ లక్ష్యాన్ని అసాధ్యంగా భావించవద్దని, చిన్నతనంలో తాను కూడా సివిల్ సర్వీసెస్ పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివే వారి కోసమేనని భావించానని, రోజులు గడిచే కొద్దీ తాను కూడా ఇతరులతో పోటీ పడవచ్చని భావించి సివిల్స్ పరీక్షలు రాశానని, పలుమార్లు వైఫల్యం చెందినప్పటికీ చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ మరోసారి ప్రయత్నించడం వల్ల విజయం సాధించానని కలెక్టర్ తెలిపారు. మనకు ఆసక్తి గల రంగంలో నైపుణ్యత సాధించడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని, అదే సమయంలో మనపై నమ్మకం ఎప్పుడు వదలవద్దని, కష్టం, నమ్మకం కలిస్తే ఎంత పెద్ద లక్ష్యమైన సాధ్యం అవుతుందని అన్నారు.
నైపుణ్యత పెంపొందించుకోవడం జీవితాంతం కొనసాగించాలని, విజయాలు జీవన ప్రయాణంలో ఒక భాగంగా మాత్రమే పరిగణించాలని కలెక్టర్ తెలిపారు.అంతకుముందు పీఎం శ్రీ కేంద్రీయ పాఠశాల చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డివైఎస్ఓ సునీల్ రెడ్డి, ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్, టీచర్లు నసీరుద్దీన్ బాబా, సీహెచ్.నరేంద్ర కుమార్, అనిల్ భట్, తన్మాయి, ఊర్మిళ, విఖాష, మమత, త్రినేత్ర పాల్గొన్నారు.

Karepally : నైపుణ్యతతో విజయాలు సొంతం : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి