భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఒకవైపు పేదరికం.. మరోవైపు తెలిసీ తెలియనితనం.. ఏ మందులు వాడాలో తెలియని అమాయకత్వం.. కడుపులో బిడ్డ సంరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక సతమతం. ఇలాంటి సందర్భంలో తల్లీబిడ్డ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. భద్రాద్రిలో ఇప్పటికే మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. దీనికి అనుసంధానంగా జిల్లాకేంద్రంలోని రామవరం ప్రాంతంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటైంది. జిల్లా నలుమూలల నుంచి సుమారు 400 మంది గర్భిణులు చికిత్స పొందుతున్నారు. వైద్యులు రోజుకు 15- 20 వరకు గర్భిణులకు ప్రసవాలు చేస్తున్నారు. వారానికి సరాసరి వంద వరకు ప్రసవాలు చేస్తున్నారు. తాజాగా కేంద్రంలో టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫెటల్ ఎనామిలీస్ (టిఫా) స్కానింగ్ యంత్రం అందుబాటులోకి వచ్చింది.
ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు..
రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి వైద్యాన్ని బలోపేతం చేసింది. తల్లీబిడ్డల సంరక్షణకు మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో టిఫా స్కానింగ్ రూ.2 వేల నుంచి రూ.3 వేలవుతుంది. గర్భిణులు 18- 22 వారాల మధ్య టిఫా స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. నిపుణులైన రేడియాలజిస్ట్‌లు స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని టిఫాలో స్కాన్ చేయవచ్చు. స్కానింగ్ కనీసం 20 – 30 నిమిషాలు సమయం పడుతుంది.
అల్ట్రా సౌండ్ స్కానింగ్‌తో నామమాత్రంగా సమస్యల గుర్తింపు..
గర్భిణుల్లో జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, మేనరిక వివాహాలు, గర్భం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు, పోషకాహార లోపం కారణాలతో గర్భంలోని శిశువుల్లో లోపాలు తలెత్తుతున్నాయి. గర్భిణులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పడు ఆయా లోపాలను గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో కొందరు గర్భిణులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తున్నారు.
శిశువు లోపాలు ముందే తెలుసుకోవచ్చు…
శిశువు తల, ఊపిరితిత్తుల వంటి అంతర్గత అవయవాలు, కంటిరెప్పలు, పెదవులు, వేళ్లు, కళ్లు, ముక్కు ఇలా ప్రతి అవయవాన్ని టిఫా స్కానింగ్ ద్వారా 3డీలో చూడొచ్చు. స్కానింగ్ ద్వారా గర్భంలోని శిశువుకు గ్రహణ మొర్రి లక్షణాలు, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకర, వెన్నుపూసలో లోపాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. వైద్యులు లోపాలను ముందే గుర్తించి శిశువు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ప్రసవం తర్వాత శిశువును కాపాడేందుకు సర్జరీలను నిర్ధారిస్తారు. శిశువుకు అందాల్సిన చికిత్సపై ముందే అవగాహనకు వస్తారు.
గర్భిణులకు ఉపయోగకరం..
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఇటీవల టిఫా స్కానింగ్ యంత్రం అందుబాటులోటుకి వచ్చింది. ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వర్చువల్ విధానంలో సేవలను ప్రారంభించారు. యంత్రం ద్వారా గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితిని సులభంగా తెలుసుకోవచ్చు. ప్రైవేట్ ఆస్ప్రత్రుల్లో ఈ స్కానింగ్ ఎంతో ఖరీదు.
– డాక్టర్ కుమారస్వామి, మెడికల్ సూపరింటెండెంట్