భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసి పలు అభివృద్ధి పనులపై చర్చించడంతోపాటు నిధులు కూడా మంజూరు చేయించారు. వర్షాకాలంలో వరదల ధాటి నుంచి తట్టుకునేందుకు మొర్రేడు వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.33కోట్లు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో రహదారుల నిర్మాణానికి రూ.96కోట్లు, 50 పడకలు ఉన్న పాల్వంచ ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయించారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.3వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతుండగా.. మరిన్ని నిధులు మంజూరు చేయించడానికి తనవంతు కృషి చేశారు. కొత్తగూడెంలో ఇప్పటికే సింగరేణి నిర్వాసితుల ఇండ్ల స్థలాలకు అనుమతి లభించిన విషయం విదితమే. నియోజకవర్గ కేంద్రంలోని రుద్రంపూర్, వెంకటేష్గని, మాయాబజార్, సుభాష్ చంద్రబోస్ నగర్లో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు స్థలాలు ఇప్పించడం కోసం గతంలో సీఎం కేసీఆర్‌ను కలిసి మంజూరు తీసుకున్నారు. ఇందుకోసం 17 ఎకరాల స్థలాన్ని కేటాయించగా అనుమతులు కూడా వచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొర్రేడు వాగు రిటైనింగ్ వాల్‌కు రూ.33కోట్లు
వర్షాకాలంలో ఏటా వరదలు వచ్చినప్పుడల్లా మొర్రేడు వాగు ఉధృతికి ముంపు ప్రాంతంలో ఉన్న ఇండ్లు దెబ్బతినడంతోపాటు కూలిపోతున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం వరదతో బాధితులు నష్టపోతున్నారు. ఈ సమస్యను గత ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే వనమా ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మొర్రేడు వాగుకు రిటైనింగ్ వాల్‌తోనే పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో సీఎం రూ.33కోట్లు మంజూరు చేశారు. పనులు ప్రారంభించిన తర్వాత మరిన్ని మంజూరు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. దీంతోపాటు పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు రహదారి సౌకర్యం కోసం రూ.96కోట్లు మంజూరు చేశారు. ఆయా పనులకు త్వరలోనే మంత్రుల చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నారు.
పాల్వంచ ఆస్పత్రి అప్‌గ్రేడ్
వైద్య రంగంలో జిల్లాను మరింతగా తీర్చిదిద్దేందుకు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన విషయం విదితమే. పాల్వంచ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి 50 పడకలు ఉన్న ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని రకాల వైద్య సేవలు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అందనున్నాయి. త్వరలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి రూ.215కోట్లు
జిల్లాల ఆవిర్భావంతో కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు తప్పనిసరి అయింది. ఇటీవల కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌ను సభలో ఎమ్మెల్యే వనమా అభివృద్ధి నిధుల గురించి అడగ్గా.. అక్కడికక్కడే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.215కోట్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి మంజూరు ఉత్తర్వులు కూడా జారీ కావడంతో రెండు మున్సిపాలిటీల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే చేపట్టాల్సిన 398 పనులను గుర్తించారు. ఇంటింటికీ వనమా తిరిగే కార్యక్రమాన్ని చేపట్టి పనుల ప్రారంభానికి సన్నాహాలు చేయనున్నారు. ప్రతి వార్డు, ప్రతి పంచాయతీలో పనులను గుర్తించి కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, సీసీ డ్రెయిన్లు, అంగన్వాడీ భవనాలు, మన ఊరు-మన బడి పథకం కింద ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు పనులను పూర్తి చేయనున్నారు.
కొత్తగూడెం అభివృద్ధే నా లక్ష్యం
సీఎం కేసీఆర్ చొరవతో కొత్తగూడెం జిల్లా కేంద్రం మరింత అభివృద్ధి చెందనున్నది. ఇప్పటికే 25 కిలోమీటర్ల పొడవునా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాను. ప్రస్తుతం రూ.3,003కోట్లతో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. వీధులన్నింటికీ సీసీ రోడ్లు వేయించాను. ప్రభుత్వం తరఫున కులవృత్తిదారులకు 300 మందికి సాయం అందించాం. ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరుతుండడంతో నియోజకవర్గ ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. సింగరేణి నిర్వాసితులకు కూడా ఇండ్ల స్థలాలు మంజూరయ్యాయి. జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చే బాధ్యత నాది.
– వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే