సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Jan 23, 2020 , 00:16:17

పోలింగ్‌ ప్రశాంతం

 పోలింగ్‌ ప్రశాంతం
  • -వైరాలో అత్యధికంగా 86.46 శాతం, ఇల్లెందులో అత్యల్పంగా 73.73 శాతం
  • -ఉదయం నుంచే బారులు తీరిన పట్టణ ఓటర్లు
  • -వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలించిన కలెక్టర్‌ కర్ణన్‌
  • -వైరా, మధిరల్లో కేంద్రాలను సందర్శించిన సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌
  • -కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న కొత్తగూడెం కలెక్టర్‌ రజత్‌కుమార్‌షైనీ
  • -సత్తుపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఎమ్మెల్యే సండ్ర
  • -పోలింగ్‌ బూత్‌లను పరిశీలించిన ఎమ్మెల్యేలు లావుడ్యా, హరిప్రియ, వనమా, సండ్ర
  • -బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించిన అధికారులు
  • -25న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

ఖమ్మం జిల్లాలో 83.41 శాతం పోలింగ్‌ నమోదు.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 75.23 శాతం.. 


ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.. అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పోలింగ్‌ సాఫీగా సాగింది. ఖమ్మం జిల్లాలో 83.41 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 75.23 శాతం ఓటింగ్‌ నమోదైంది. అత్యధికంగా వైరా మున్సిపాలిటీలో (86.46 శాతం), అత్యల్పంగా ఇల్లెందులో (73.73 శాతం) ఓటింగ్‌ జరిగింది.. ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌ ఓటింగ్‌ సరళిని జిల్లా కేంద్రం నుంచే వెబ్‌కాస్టింగ్‌లో పరిశీలించగా, పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ వైరా, మధిర మున్సిపాలిటీల పరిధిలోని పలు కేంద్రాలను సందర్శించారు. సిబ్బందికి సలహాలు, సూచనలు చేస్తూ ముందుకుసాగారు. కొత్తగూడెం కలెక్టర్‌ రజత్‌కుమార్‌షైనీ జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోగా, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబ సభ్యులతో కలిసి సత్తుపల్లిలో ఓటు వేశారు. ఆయా మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్‌, హరిప్రియ, వనమా, సండ్ర పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. కాగా, ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌లను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ అధికారులు స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. 25వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 

- ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదుచోట్ల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. చిన్న సంఘటన కూడా జరగకపోవడం వెనుక అధికారులు, పోలీసుల కృషి ఎంతో ఉంది. ఉమ్మడి జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర, ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటల నుంచే పట్టణ ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళలు, యువ తి, యువకులు, నూతన ఓటర్లు ఓటువేసేందుకు ఉత్సా హం చూపారు. ఖమ్మం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో 83.41 శాతం పోలింగ్‌ నమోదైంది. సత్తుపల్లిలో 81.10 శాతం, మధిరలో 82.56 శాతం, వైరాలో  86.46 శాతం, కొత్తగూడెంలో 76.47 శాతం, ఇల్లెందులో 73.73 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వైరా మున్సిపాలిటీలో పోలింగ్‌ నమోదుకాగా ఇల్లెందులో అతితక్కువగా పోలింగ్‌ నమోదైంది. ఖమ్మం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో మొత్తం 64,581 మంది ఓటర్లు ఉండగా వీరిలో 53,909 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో పురుష ఓట ర్లు 31,093 మంది ఉండగా వీరిలో 25,976 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లల్లో మహిళలు 33,482 మంది ఉండగా 27,929 మంది తమ ఓటు హక్కును వినియోగిం చుకోగా, ఇతరులు ఆరుగురు ఉండగా నలుగురు మాత్రమే వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు మున్సిపాలి టీలలో మొత్తం ఓటర్లు 91, 643 మంది ఓటర్లు ఉండగా 69,201 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 44,106 మంది ఉండగా వీరిలో 33,238 మంది ఓటు హక్కును వినియో గించుకున్నారు. అదే విధంగా  మహిళా ఓటర్లు 47,537 మంది ఉండగా వీరిలో 35,963 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 25న జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 


 పోలింగ్‌ సరళిని పరిశీలించిన అధికారులు..

మధిర మున్సిపాలిటీలోని 10 వ వార్డులో అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌, ఏసీపీ రామోజీరమేష్‌లు  ఎన్నికల సరళిని పరిశీలించారు. కొత్తగూడెంలోని 35వ వార్డులో ట్రైనీ ఐపీఎస్‌ అధికారి రోహిత్‌ పోలింగ్‌ సరళిని పరిశీలించి దివ్యాంగురాలితో మాట్లాడారు. సత్తుపల్లిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు, ఐటీడీఏపీవో గౌతమ్‌ పరిశీలించారు. మధిర మున్సిపాలిటీలోని మడుపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ పరిశీలించారు. మధిర మున్సిపాలిటీలోని 20, 21 బూత్‌లలో ఎన్నికల పరిశీలకులు గౌతమ్‌ పోలింగ్‌ విధానాన్ని పరిశీలించారు. చదువు వచ్చిన వారు కూడా వేలిముద్ర ఎందుకు వేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. వైరా మున్సి పాలిటీలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే లావుడ్యా రా ములు నాయక్‌ పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైరాలో అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) ఇంజరాపు పూజ పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు.    


బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. సత్తుపల్లి మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్‌ బాక్సులను సత్తుపల్లిలోని జ్యోతి నిల యం పాఠశాలకు తరలించారు. అదే విధంగా మధిర మున్సిపాలిటీ బ్యాలెట్‌ బాక్సులను మధిర లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు తరలించారు. వైరా మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్‌ బాక్సులను వైరాలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద గల వెటర్నరీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ స్థలాలలోనే  కౌంటింగ్‌ ఏర్పా ట్లు చేయడం జరిగింది. ఈ నెల 25వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది. 


ఓటేసిన ప్రముఖులు..

మున్సిపల్‌ ఎన్నికల్లో అనేక మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య భార్య మహాలక్షి, కుమారులు భార్గవ్‌, తేజలతో కలిసి జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కల్లూరు ఆర్‌డీవో శివాజీ సత్తుపల్లిలోని రెండో వార్డులో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క మధిరలోని 9వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైరా మున్సిపాలిటీలో ఏసీపీ కే. సత్యనారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ కొత్తగూడెం పట్టణంలోని 34వ వార్డులో ఓటు వేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలోని అన్ని వా ర్డుల్లో జరిగిన పోలింగ్‌ సరళిని టీఆర్‌ఎస్‌ ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తాతా మధు, స్థానిక శాసనసభ్యురాలు బాణోత్‌ హరిప్రియ నాయక్‌లు పరిశీలించారు. 


సత్తుపల్లిలో 81.10 శాతం పోలింగ్‌ నమోదు..

సత్తుపల్లిలో మొత్తం ఓటర్లు 18,321 మంది ఉండగా వీరిలో 14,859 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.10 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఈ మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా 46 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం పురుష ఓటర్లు 8803 మంది కాగా 7142 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మొత్తం మహిళా ఓటర్లు 9,517 మంది కాగా 7,717 మంది ఓటు వేశారు. ఇతరులు ఒకరు ఉండగా వారు ఓటు హక్కును వినియోగించుకోలేదు. పురుషులలో 81.13 శాతం, మహిళల్లో 81.09 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.


మధిరలో 82.56 శాతం..

మధిర మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 24,251 మంది ఉండగా వీరిలో 20,021 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 82.56 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ మున్సిపాలిటీలో 22 వార్డులుండగా 44 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ  మొత్తం పురుష ఓటర్లు 11,725 మంది కాగా 9,674 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మొత్తం మహిళా ఓటర్లు 12,521 మంది కాగా 10,345 మంది ఓటు వేశారు. ఇతరులు ముగ్గురు ఉండగా వారిలో ఇద్దరు ఓటు హక్కును విని యోగించుకున్నారు. పురుషులలో 82.49 శాతం, మహిళల్లో 82.62 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


వైరాలో 86.46 శాతం..

వైరా మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 22,009 మంది ఉండగా వీరిలో 19,029 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 86.46 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 20 వార్డులుండగా 41 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం పురుష ఓటర్లు 10,563 మంది కాగా 9,160 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మొత్తం మహిళా ఓటర్లు 11,444 మంది కాగా 9,867 మంది ఓటు వేశారు. ఇతరులు ఇద్దరు ఉండగా ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులలో 86.72 శాతం, మహిళల్లో 86.22 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


కొత్తగూడెంలో 76.47 శాతం..

కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 59,641 మంది ఉండగా వీరిలో 45,605 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 36 వార్డులకుగాను 85 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం పురుష ఓటర్లు 28,591 మంది కాగా 21,818 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మొత్తం మహిళా ఓటర్లు 31,050 మంది కాగా 23,787 మంది ఓటు వేశారు. కొత్తగూడెం మున్సి పాలిటీలో 76.47 శాతం పోలింగ్‌ నమోదైంది.

 

ఇల్లెందులో 73.73 శాతం..

ఇల్లెందు మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 32,002 మంది ఉండగా వీరిలో 23,596 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులకుగాను 48 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం పురుష ఓటర్లు 15,515 మంది కాగా 11,420 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మొత్తం మహిళా ఓటర్లు 16,487 మంది కాగా 12,176 మంది ఓటు వేశారు. ఇల్లందు మున్సిపాలిటీలో 73.73 శాతం పోలింగ్‌ నమోదైంది. logo