ఖమ్మం అర్బన్, ఆగస్టు 4: జిల్లా విద్యాశాఖలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువైన ఈ శాఖలో ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ కూడా గజిబిజిగా మారింది. ఉద్యోగోన్నతులు పొందే అర్హత కలిగిన ఉపాధ్యాయులు తమ సర్టిఫికెట్ల పరిశీలన కోసం సోమవారం డీఈవో కార్యాలయానికి హాజరయ్యారు. వందల సంఖ్యలో వచ్చిన ఉపాధ్యాయులు తమ ప్రమోషన్లు, సర్టిఫికెట్ల పరిశీలన వంటి అంశాలపై తమ సందేహాలను, సమస్యలను వ్యక్తం చేశారు. కానీ వాటిని నివృత్తి చేసేందుకు డీఈవో, ఏడీ, సూపరింటెండెంట్లు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలో తెలియని స్థితిలో ఉండిపోయారు. అయితే, ఇలాంటి పరిస్థితులను ఇదివరకెప్పుడూ చూడలేదని, విద్యాశాఖను పర్యవేక్షించే వారు లేకపోవడం దారుణమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
గ్రేడ్-2 హెచ్ఎంలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏ కేటగిరీ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలనకు 8 బృందాలను నియమించారు. సబ్జెక్టుల వారీగా బృందాల సభ్యులు ఆయా సర్టిఫికెట్ల పరిశీలనను నిర్వహించారు. ఒకేసారి పదుల సంఖ్యలో వచ్చిన ఉపాధ్యాయులు.. పరిశీలన బృందాల చుట్టూ చేరడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఆయా బృందాల బాధ్యులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ధ్రువపత్రాలపై కొందరు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. మరికొందరు ఉపాధ్యాయులకు రెండు సబ్జెక్టుల్లో ప్రమోషన్‌కు అవకాశం ఉండడంతో ఏ సబ్జెక్టులో కావాలో? ఏ కేటగిరీలో ప్రమోషన్ వద్దనుకుంటున్నారో? అనే అంశాలను రాత పూర్వకంగా అందజేశారు. సోమవారం జరిగిన ప్రక్రియకు సుమారు 213 మంది టీచర్లు హాజరైనట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. పరిశీలన బృందాల సభ్యులు రాత్రి 9 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించి ఆ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.
ఇన్చార్జి డీఈవోగా జడ్పీ డిప్యూటీ సీఈవో నాగపద్మజకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నాలుగు రోజుల ఆటంకాలకు తెరపడింది. ఇన్చార్జి డీఈవోగా మంగళవారం ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. సెక్టోరల్ విభాగంలోనూ కలెక్టర్ పలు మార్పులు చేసినట్లు తెలిసింది. ఏఎంవో పోస్టుకు ప్రధానోపాధ్యాయుడు చావా శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకోగా.. వెంటనే నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 1న ఖాళీ అయిన ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్టుకు నేలకొండపల్లి మండలంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు మంత్రి ద్వారా పైరవీ చేస్తున్నట్లు తెలుస్తోంది.