జమ్మికుంట, జనవరి 23 : ‘హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడతరా..? పథకాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలె. కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలె. పథకాల అమలయ్యేంత వరకు ప్రజల గొంతుకనవుతా. ప్రశ్నిస్తూనే ఉంటా. ఎన్ని కేసులు పెడతారో.. పెట్టుకోండి. హామీలన్నీ నెరవేర్చేదాకా నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనియ్య’ అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘గ్రామ సభకు ఇంత మంది పోలీసులెందుకు? కొట్టి సంపుతరా ఏంది?’ అని ప్రశ్నించారు. ‘మీకు దండం పెడుతున్నా.. అర్హులందరికీ పథకాలు ఇయ్యండి’ అని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జమ్మికుంట మండలం సైదాబాద్‌లో గ్రామసభను అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వస్తున్నారనే సమాచారం మేరకు డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బందితోపాటు ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహించాయి. ఎమ్మెల్యే సభకు రాగానే.. అధికారులు ప్రారంభించారు. పలు పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికైన పేర్ల జాబితాను చదివి వినిపించారు. వెంటనే స్థానిక ప్రజలు ఒక్కసారిగా లేచి, అర్హులకు పథకాలు ఎందుకియ్యడం లేదంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. అప్పటి వరకు స్టేజీ మీద ఉన్న ఎమ్మెల్యే, ప్రజల మధ్యకు వెళ్లారు. వాళ్ల మధ్య కూర్చున్నారు. సమస్యలు తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించారు. అర్హుల పేర్లు ఎందుకు జాబితాలో లేవో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు.
ప్రజలు అధికారులను అడిగేందుకు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కుర్చీ నుంచి దిగి కింద కూర్చున్నారు. అర్హులైన అందరికీ పథకాలు అమలు చేయాలని గులాబీ పూలు అందిస్తూ వినూత్న తరహాలో నిరసన తెలిపారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని, పూర్తిస్థాయిలో పథకాలు అమలు కోసం ఉన్నతాధికారుల దృష్టికి ఎమ్మెల్యే విజ్ఞప్తిని తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే వెళ్లిపోయారు.
ప్రజలను రక్షించాల్సిన పోలీసులు లంచాలు తీసుకుని పనిచేయడం సరికాదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హితవుపలికారు. హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ, సీఐలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. గురువారం ఆయన జమ్మికుంటలో విలేకరులతో మాట్లాడారు. ఓ కేసు విషయంలో జమ్మికుంట సీఐకి 3లక్షల రూపాయల లంచం ఇచ్చానంటూ ఓ ఆడియో సంభాషణ వైరల్ కాగా, దానిపై ఆయన స్పందించారు. డివిజన్ పోలీసుల పనితీరు బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ సంపత్, నాయకులు, తదితరులున్నారు.